అందరికీ సోకితే.. కరోనా కథ క్లోజంట

అందరికీ సోకితే.. కరోనా కథ క్లోజంట

న్యూఢిల్లీకరోనా మహమ్మారిని ఎట్లా ఖతం చేయాలె? టీకాలైనా రావాలె లేదా మందులైనా తయారు చేయాలె. మరి అప్పటిదాకా..? ఇంకో ఆప్షన్‌‌ ఉంది.. ఆ వైరస్‌‌ మనకు సోకాలి.. దాని నుంచి ఇమ్యూనిటీ రావాలి. దీన్నే హెర్డ్‌‌ ఇమ్యూనిటీ అంటారు. కుర్రకారు ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి దేశాలకు అదే మంచి మందు అవుతుందని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ, ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకానమిక్స్ అండ్ పాలసీ’ రీసెర్చర్లు చెబుతున్నారు.  పేద దేశాలకూ మేలు జరుగుతుందని అంటున్నారు.

ఇదీ స్ట్రాటజీ..

కరోనా వైరస్ సోకి, కోలుకున్న వ్యక్తుల శరీరంలో వైరస్ ను నాశనం చేసే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకితే, ఆటోమేటిక్ గా ఆ వైరస్ ను రోగనిరోధక వ్యవస్థ హతమారుస్తుంది. అలాగే ఒక ప్రాంతంలో ఎక్కువ మందికి వైరస్ సోకి, వారంతా కోలుకుంటే.. ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వస్తుంది. దీనినే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఏదైనా ఒక ప్రాంతంలో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే అక్కడ కరోనా వైరస్ కు ఇమ్యూనిటీ లేని కొత్త వ్యక్తులు దొరకక వ్యాప్తి తగ్గిపోతుందని చెప్తున్నారు.

జాగ్రత్తలు అవసరం..

ఇండియా సహా, ఆఫ్రికాలోని పేద దేశాలు ఎక్కువ రోజులు లాక్ డౌన్ ను, మరింత ఆర్థిక నష్టాలను భరించలేవని అందుకే ఈ స్ట్రాటజీని అమలు చేయాలని సైంటిస్టులు చెప్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిని పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలని, యువతకు మాత్రమే లాక్ డౌన్ ఎత్తేయాలని సూచిస్తున్నారు. అదేసమయంలో ఫిజికల్‌‌ డిస్టెన్సింగ్, ఎక్కడికక్కడ టెస్టులు, ట్రీట్‌‌మెంట్‌‌ వేగవంతం చేయాలని, అప్పుడే ఈ విధానం సక్సెస్ అవుతుందని పేర్కొంటున్నారు.

రిస్క్ కూడా ఎక్కువే..

ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారమని ఈ స్ట్రాటజీని బ్రిటన్ తిరస్కరించింది.  ఇండియాలో యువతలో కూడా ఎక్కువ మందికి షుగర్‌‌, బీపీ వంటివి ఉన్నాయని, అలాంటివారికి ఇది చాలా రిస్క్ అవుతుందని కూడా పలువురు చెప్తున్నారు. వైరస్ సోకి, పేషెంట్లుగా మారేవారిని చనిపోకుండా కాపాడేందుకు పెద్ద ఎత్తున హాస్పిటల్, ట్రీట్ మెంట్ సౌకర్యాలు ఉండాలని, ఇందులో తేడా వస్తే పెద్దఎత్తున మరణాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.

నవంబరు కల్లా సాధించొచ్చు..

వచ్చే ఏడు నెలల పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుండా, పలు చర్యలు మాత్రం తీసుకుంటే చాలు.. నవంబరు నాటికి దేశంలో 60% మందికి కరోనాకు ఇమ్యూనిటీ వస్తుందని వీరు చెప్తున్నారు. ఇటలీ, తదితర యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో 65 ఏళ్లలోపు వారే 93.5% ఉన్నారని, అందువల్ల ఇక్కడ మరణాల ముప్పు చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఈ స్ట్రాటజీ అమలు చేయకపోతే, వచ్చే ఏడాది జూన్ వరకూ లాక్ డౌన్ లు, ఇతర ఆంక్షలు అమలు చేసుకుంటూ పోవాల్సి వస్తుందని సీడీడీఈపీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీ నారాయణన్ అంటున్నారు