కరోనా లెక్కల్లోనే కాదు.. మలేరియా, డెంగ్యూ కేసుల్లోనూ గందరగోళం

కరోనా లెక్కల్లోనే కాదు.. మలేరియా, డెంగ్యూ కేసుల్లోనూ గందరగోళం

బల్దియాది ఒక లెక్క.. హెల్త్ డిపార్ట్ మెంట్ ది ఇంకో లెక్క

హైదరాబాద్, వెలుగు : కరోనా లెక్కలే కాదు… మలేరియా, డెంగ్యూ కేసుల్లోనూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. బల్దియా అధికారులేమో గొప్పగా ఈ సారి మస్తు కేసులను తగ్గించినట్లు ప్రచారం చేసుకుంటుంటే…హైదరాబాద్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతున్న వివరాలు మాత్రం వేరేగా ఉన్నాయి. దాదాపు సగానికి పైగా కేసుల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. గతేడాది డెంగ్యూ, మలేరియా జర్వాలతో జనం ఆగమాగమైన్రు. వేలల్లో కేసులు నమోదైనయ్. కానీ గ్రేటర్ అధికారులు మాత్రం మలేరియా 76, డెంగ్యూ 732 కేసులు మాత్రమే నమోదైనట్లు లెక్కలు చూపిచ్చిన్రు. కానీ హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారుల లెక్కల్లో మాత్రం మలేరియా 305, డెంగ్యూ 2870 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. మలేరియా, డెంగ్యూ జ్వరాల నివారణలో విఫలమవుతున్నట్లుగా జనం నుంచి విమర్శలు రావటంతో బల్దియా అధికారులు గతేడాదే లెక్కలు తక్కువ చూపించినట్లు విమర్శలు వచ్చాయి. అయినా ఈ ఏడాది అదే విధంగా మళ్లీ తప్పుడు లెక్కలు ప్రకటించారు.

3  మలేరియా కేసులంట..

ఈ ఏడాది లో గ్రేటర్ పరిధిలో మలేరియా కేసుల లెక్క చూస్తే షాక్ అవుతారు. గత 10 నెలల నుంచి గ్రేటర్ పరిధి మొత్తంలో  ముగ్గురే మలేరియా బారిన పడ్డారంట. డెంగ్యూ కేసుల సంఖ్య కూడా 52 చూపించారు. ఇంత తక్కువ కేసులు నమోదవటంపై అనుమానంతో ‘వెలుగు ప్రతినిధి’ అసలు లెక్కలు తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ ను కలిసి జిల్లాలో కేసుల సంఖ్య వివరాలు అడిగారు. ఆయన ఇచ్చిన లెక్కల్లో ఈ ఏడాది మలేరియా కేసులు 18 , డెంగ్యూ కేసులు 134  చూపించారు. బల్దియా పరిధి అంటే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధి కూడా ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన లెక్కలు ఒక్క జిల్లా పరిధిలో లెక్కలతో పోల్చితేనే సగానికి పైగా తేడా కనిపిస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్ తో  పెరిగిన హెల్త్ కాన్షియస్

నిజానికి గతేడాదితో పోల్చితే ఈ సారి మలేరియా, డెంగ్యూ కేసుల సంఖ్య తగ్గింది. ఐతే ఇందుకు జీహెచ్ఎంసీ అధికారు లు చేపట్టిన కార్యక్రమాలు మాత్రం ప్రత్యే కంగా ఏమీ లేవు. 6 నెలలుగా కరోనా ఎఫెక్ట్ తోనే జనం పరేషాన్ అవుతున్నారు. మహమ్మారి ఎఫెక్ట్ మొదలైన నాటి నుంచి జనంలో హెల్త్ కాన్షియస్ నెస్ పెరిగింది. మాస్క్ లు పెట్టుకోవటం, శానిటైజర్లు వాడటం, ఫిజికల్ డిస్టెన్స్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటంతో పెద్దగా దోమ ల ఎఫెక్ట్ లేకుండా పోయింది. కరోనాలో నే అన్ని జర్వాలు కలిసి పోయాయి. దీంతో మలేరియా, డెంగ్యూ ఎఫెక్ట్ ఏమీ లేదు. అయితే ఈ క్రెడిట్ జీహెచ్ఎంసీ అధికారులు తమ ఖాతాలో వేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది కూడా మలేరియా, డెంగ్యూ కేసులు సంఖ్య ఇలాగే తక్కువ నమోదయ్యేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను జనం కోరుతున్నారు.