ఇండియన్ ఎకానమీకి కరోనా ఎఫెక్ట్

ఇండియన్ ఎకానమీకి కరోనా ఎఫెక్ట్

కరోనాతో మన ఎకానమీకి సవాల్

ఇండియాను వణికిస్తోంది

ఎకానమీకి మరో షాక్

ట్రావెలర్స్‌‌, ఎగుమతులపై ఆంక్షలు

వ్యాపారాలపై తీవ్ర ప్రభావం

భారీగా పెరిగిన మాస్కుల ధర

వెలుగు, బిజినెస్‌‌ డెస్క్: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, మన మార్కెట్లు హడలెత్తాయి. ఇప్పటికే ఎకానమీ నెమ్మదించడంతో, ప్రొడక్షన్ తగ్గిపోయి, చేతుల్లో మనీ లేక సతమతమవుతోన్న ఇండియన్లకు కరోనా మరో షాక్‌‌గా ఉంది. చైనాలో విజృంభించిన ఈ వైరస్‌‌తో ఇప్పటికే అక్కడ చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు సరుకు సరఫరా తగ్గిపోయింది. గ్లోబల్‌‌గా ఈ ప్రభావం బాగా చూపిస్తోంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఆ పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేయడం ప్రారంభించాయి. ట్రావెలర్స్‌‌పై ఆంక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ తగ్గిపోయాయి. ఈ ప్రభావం మన దేశానికి కీలకంగా ఉన్న ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా దెబ్బకొడుతోంది. కరోనా వైరస్ కారణంగా పారాసిటమాల్ వంటి 25 డ్రగ్స్‌‌ ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు విధించడం పరిశ్రమకు చాలా నష్టమని, మరోసారి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

రోజుకు రూ.50 కోట్ల-రూ.100 కోట్ల దెబ్బ

తెలంగాణలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో, ఇక్కడికి వచ్చే ఎయిర్ ట్రావెలర్ల టిక్కెట్ క్యాన్సిలేషన్స్‌‌ పెరిగాయి. ఈ క్యాన్సిలేషన్ వల్ల బిజినెస్‌‌లపై ఏ మేర ప్రభావం చూపుతుందో కరెక్ట్‌‌గా తెలియనప్పటికీ, రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దెబ్బతినే అవకాశం కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతోంది. డొమెస్టిక్ ట్రావెల్‌‌ బాగా ప్రభావితమవుతున్నట్టు ఓ ఇండస్ట్రీ బాడీ డైరెక్టర్ చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఉద్యోగులను బయటి దేశాలకు పంపడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌‌ల ద్వారానే మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్–మే సీజన్ పెళ్లిళ్ల సీజన్. చాలా మంది ఇక్కడికి పెళ్లిళ్లకు వస్తుంటారు. ఇప్పుడు ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు ఇక్కడికి రావడం తగ్గించేశారు. ఈ ప్రభావం దీనిపై ఆధారపడ్డ ఏజెంట్లు, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, కారు రెంటల్స్, ఈవెంట్ మేనేజ్‌‌మెంట్స్, మీటింగ్స్, వెడ్డింగ్ మేనేజర్స్ వంటి 36 సెగ్మంట్లపై చూపుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు జాబ్స్ లో ఒకటి ఈ 36 సెగ్మెంట్‌లలోనే ఉంటుంది.  అంటే ట్రావెల్ అండ్ టూరిజంలో పనిచేసే ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

ఆటో ఇండస్ట్రీ….

ఎకానమీ నెమ్మదించడంతో, ఆటో ఇండస్ట్రీ గత కొంత కాలంగా భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ సమయంలో కరోనా ఎఫెక్ట్‌‌ ఆటో ఇండస్ట్రీకి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అయింది. ఆటో ఇండస్ట్రీకి కావాల్సిన చాలా పార్ట్‌‌లు చైనాలోనే తయారవుతాయి. ఇప్పుడు వాటి సప్లయి తగ్గింది. ఇప్పటి వరకైతే ఇన్వెంటరీ ఉందని ఇండస్ట్రీ చెబుతున్నా… చైనా షట్‌‌డౌన్ ఇలానే కొనసాగితే, ఇండియన్ ఆటో మాన్యుఫాక్చరింగ్ 2020లో 8 నుంచి10 శాతం తగ్గే అవకాశం ఉంది. మాన్యుఫాక్చరింగ్ తగ్గితే, ఈ ఇండస్ట్రీపై ఆధారపడ్డ చాలా మందికి ఉపాధి పోతుంది. ఇలా ఆటోతో ఇంటర్‌‌‌‌లింక్ అయిన ప్రతి సెగ్మెంట్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇంజనీరింగ్ గూడ్స్…

ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఇంజనీరింగ్ గూడ్స్ స్వల్పంగా తగ్గుతాయని ఇంజనీరింగ్ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఈపీసీ) ఛైర్మన్ రవి సెహగల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఈ ఎగుమతులు 81 బిలియన్ డాలర్లుంటే, ఇవి ఇప్పుడు 80 బిలియన్ డాలర్ల కంటే కిందకు పడిపోతాయని అన్నారు.

ఎకానమీపై మరింత ప్రభావం

కరోనా ఎఫెక్ట్‌‌తో చైనా ఎకానమీ జనవరి–మార్చి క్వార్టర్ లో 1.2 శాతం పడిపోతే.. అది ఇండియన్ జీడీపీకి షాక్‌‌గా ఉండనుంది. ఇండియాలో కేసులు పెరుగుతుండటం, ఇప్పటికే నెమ్మదించిన మన ఎకానమీపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. డిమాండ్ వైపు 0.4–0.5 శాతం తగ్గే అవకాశం ఉందని బ్లూమ్‌‌బర్గ్ ఎకానమిక్స్ రిపోర్ట్ చెప్పింది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ గ్లోబల్ ఎకానమీని 1 శాతం వరకు తగ్గిస్తుందని రిపోర్ట్‌‌లు వస్తున్నాయి. ట్రేడ్ పరంగా చైనా ఎగుమతుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా, దిగుమతుల్లో నెంబర్ టూగా. కరోనా నుంచి మన ఎకానమీని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో క్రూడాయిల్ దిగొస్తుండటంతో, ఇండియన్ వ్యాపారాలు ఈ ధరల తగ్గుదల నుంచి లాభం పొందే అవకాశాలున్నాయి. ఇన్‌‌పుట్ కాస్ట్ కూడా పడిపోతుంది. కరోనా బారి నుంచి ఇండియాను కాపాడేందుకు తదుపరి పాలసీలో ఆర్‌‌‌‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది.బబుధవారం ఇంట్రాడేలో 945 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, చివరికి 214 పాయింట్ల నష్టంతో 38,409.48 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 52 పాయింట్ల నష్టపోయి 11,251 వద్ద క్లోజైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ కూడా బలహీనంగానే ట్రేడైంది.

ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ….

మన ఎలక్ట్రానిక్స్‌‌ ఇండస్ట్రీలో వాడే ముడి సరుకులు, ఫైనల్ ప్రొడక్ట్‌‌ తయారీకి వాడే ఎలక్ట్రానిక్స్‌‌కు మేజర్ సప్లయిర్ చైనా. కరోనా వల్ల ఇండియా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ… సప్లయి  ఇబ్బందులను, ప్రొడక్షన్ అంతరాయాన్ని, ధరల పెంపును ఎదుర్కొనాల్సి వస్తుంది. కొన్ని ఎలక్ట్రానిక్స్‌‌పై రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌‌తో పాటు.. మొబైల్స్‌‌కు అవసరమయ్యే పార్ట్‌‌లను, మొబైల్స్‌‌ను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మన చేతుల్లో ఉన్న ఫోన్లలో చాలా వరకు చైనావే ఉంటున్నాయి. ఇప్పుడు చైనాలో ప్రొడక్షన్ తగ్గడంతో, అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. ఇప్పుడే కాకపోయినా.. రాబోయే కాలంలో మొబైల్స్‌‌కు ధరలు పెరగడమో లేదా మొబైల్స్ ఎక్కువగా దొరకకపోవడమో జరగొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి.

ఫార్మా ఇండస్ట్రీ…

చైనాలో కరోనా అవుట్‌‌బ్రేక్ అయినప్పుడు.. ఇండియాలోని షిప్పింగ్, ఫార్మాస్యూటికల్స్ నుంచి ఆటోమొబైల్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌‌టైల్ వరకున్న సెక్టార్లన్ని కుదేలయ్యాయి. వాటికి అవసరమయ్యే ముడిసరుకులు, దిగుమతులు చైనా నుంచి ఇండియాకు రావడం తగ్గిపోయింది. ఫార్మాస్యూటికల్స్‌‌ ప్రొడక్షన్‌‌లో సప్లయి కొరత ఏర్పడింది. ఇండియా ఫార్మా హబ్ అయినప్పటికీ, ఇక్కడ తయారయ్యే డ్రగ్స్‌‌కు అవసరమయ్యే చాలా వరకు ముడిసరుకులు అంటే ఏపీఐలు, బల్క్ డ్రగ్స్‌‌ చైనా నుంచే దిగుమతి అవుతాయి. వాటి దిగుమతులు తగ్గడమే కాకుండా.. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఎగుమతులపై మన దేశం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఇండస్ట్రీని దెబ్బతీస్తాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఎగుమతుల నిషేధంతో, కాంట్రాక్ట్‌‌లు రద్దు అవుతాయని, అలా రద్దయితే ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందని పేర్కొంటున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌‌లో న్యాయపరమైన  చిక్కులు తలెత్తుతాయని చెబుతున్నాయి.

కెమికల్ ఇండస్ట్రీ….

చైనాలో కొన్ని కెమికిల్ ప్లాంట్స్ పూర్తిగా మూతపడ్డాయి. షిప్‌‌మెంట్లు, లాజిస్టిక్స్‌‌పై ఆంక్షలు విధించారు. ముడి సరుకుల సప్లయిలో అంతరాయంతో, 20 శాతం వరకు ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ ప్రభావం ఇండియాలో బిజినెస్‌‌లపై కూడా పడుతోంది. కొన్ని వ్యాపారాలు ఇటీవల ఇండియాకు రావాలని భావించినా.. కరోనా​ వల్లే వెనక్కి తగ్గాయి.

ఓయో 5 వేల మందిపై వేటు…

కరోనా దెబ్బకు ఓయో రూమ్స్ తన గ్లోబల్ వర్క్‌‌ఫోర్స్‌‌లో 5 వేల మందిని తీసేసి, 25 వేల మందికి కుదిస్తోంది. చైనాలో ఎక్కువగా ఉద్యోగులను తీసేస్తోంది. జనవరిలో తమ గ్లోబల్ ఉద్యోగులను 17 శాతం వరకు తగ్గిస్తామని తెలిపింది.

తన వంతు ఫేస్‌‌బుక్ సాయం..

కరోనా వైరస్‌‌పై తప్పుడు సమాచారం పాకకుండా ఉండేందుకు..  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌‌తో కలిసి ఫ్రీ అడ్వర్‌‌‌‌టైజింగ్ ఇస్తామని ఫేస్‌‌బుక్ ఫౌండర్ మార్క్‌‌ జుకర్ బర్గ్ తెలిపారు. నేషనల్ హెల్త్ మినిస్ట్రీలు, డబ్ల్యూహెచ్‌‌ఓ, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, యూఎన్‌‌ఐసీఈఎఫ్‌‌ వంటి వాటితో కలిసి పనిచేస్తామని జుకర్ బర్గ్ తన ఫేస్‌‌బుక్ పోస్ట్‌‌లో తెలిపారు.

మాస్కు ధర రూ.300 …

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్ ప్రాంతంలో ఫేస్‌‌ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ దొరకడం లేదు. డిమాండ్ బాగా ఉండటంతో, వీటి ధరలు కూడా పెరిగిపోయాయి. కొన్ని మెడికల్ షాపులు అంతకుముందు రూ.150కు అమ్మిన మాస్కులను, ఇప్పుడు రూ.300కు విక్రయిస్తున్నాయి. హ్యాండ్ శానిటైజర్స్‌‌కు, మాస్కులకు గత రెండు నెలల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోందని ఓ దుకాణదారుడు చెప్పాడు. డెటాల్, హిమాలయ వంటి బ్రాండ్ల హ్యాండ్ శానిటైజర్లు అసలు మార్కెట్‌‌లో దొరకడం లేదు. ఈ బాటిల్స్‌‌ను రూ.200 నుంచి రూ.600 మధ్యలో విక్రయిస్తున్నారు. షియోమి, రియల్‌‌మీ అనంతరం చైనీస్ స్మార్ట్‌‌ఫోన్ మేకర్ ఇన్‌‌ఫినిక్స్‌‌ తన ఫ్లాగ్‌‌షిప్ లాంచ్ ఈవెంట్‌‌ను క్యాన్సిల్ చేసింది. ఎస్‌‌5 ప్రొ లాంచ్ ఈవెంట్‌‌ను ఆపేసింది. గ్లోబల్‌‌గా కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఈ ఈవెంట్‌‌ను క్యాన్సిల్ చేసినట్టు ఇన్‌‌ఫినిక్స్ మొబైల్ చెప్పింది.

ఇండియా దిగుమతి చేసుకునే టాప్ 20 ప్రొడక్ట్‌‌ల్లో ఎక్కువ భాగం చైనా నుంచే వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ దిగుమతులు.. 45 శాతం చైనా నుంచే
ఆర్గానిక్ కెమికల్స్‌ దిగుమతులు.. 60 శాతం చైనావే
ఆటోమొటివ్ పార్ట్‌‌లు 25 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి
ఫార్మాస్యూటికల్ ముడి వస్తువులు 65–70 శాతం చైనావే

90 శాతం మొబైల్ ఫోన్లు చైనా నుంచి ఇండియాకు వస్తున్నాయి.