క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పేషెంట్.. త‌ల్లీ, పిల్ల‌లు క్షేమం

క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పేషెంట్.. త‌ల్లీ, పిల్ల‌లు క్షేమం

క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌హిళ ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్ల‌లు ఎటువంటి ఇన్ఫెక్ష‌న్ సోక‌కుండా వైద్యులు విజ‌య‌వంతంగా నార్మ‌ల్ డెలివ‌రీ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ సిటీ ఎంటీహెచ్ హాస్పిట‌ల్ లో కొద్ది రోజులుగా క‌రోనా చికిత్స పొందుతున్న నిండు గ‌ర్భిణికి ప్ర‌స‌వం చేసిన‌ట్లు ఆస్ప‌త్రి ఇన్ చార్జ్ డాక‌ర్ట్ సుమిత్ శుక్లా చెప్పారు. ఆ మ‌హిళ ఆస్ప‌త్రిలో చేరే స‌మ‌యానికి నెల‌లు నిండి ఉండ‌డంతో ఐసోలేష‌న్ వార్డులో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. ఎటువంటి స‌మ‌స్య లేకుండా ఆమెకు నార్మ‌ల్ డెలివ‌రీ అయ్యి, ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించ‌డంతో ఆమె ఎంతో సంతోషించింద‌న్నారు. త‌ల్లీబిడ్డ‌లు క్షేమంగా ఉన్నార‌ని చెప్పారు. ప్ర‌స‌వ స‌మ‌యంలో వైద్యులు పీపీఈ కిట్, మాస్కులు ధ‌రించ‌డంతో పాటు అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని, పుట్టిన పిల్ల‌ల‌కు వైర‌స్ సోక‌క‌పోవ‌డంతో వైద్యులు ఆనందం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా న‌మోదు కాగా.. ఆ రాష్ట్రంలో ఇండోర్ మేజ‌ర్ హాట్ స్పాట్ గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్రంలో 6,170 క‌రోనా పాజిటివ్ కేసులు రాగా.. అందులో 2,933 కేసులు ఒక్క ఇండోర్ లోనే న‌మోద‌య్యాయి.