ప్రతి వందలో 9 మందికి కరోనా పాజిటివ్

ప్రతి వందలో 9 మందికి కరోనా పాజిటివ్
  • 0.33 నుంచి 9 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేట్
  • ఇంకో 3 వారాలు ఇదే ట్రెండ్ ఉండొచ్చంటున్న ఆఫీసర్లు
  • కొత్తగా 6,551 కేసులు.. 43 మరణాలు నమోదు
  • 4 లక్షలు దాటిన కేసులు.. 2 వేలు దాటిన మరణాలు

రాష్ర్టంలో కరోనా టెస్ట్ పాజిటివిటీ రేట్‌‌ 9 శాతానికి చేరింది. టెస్ట్ చేయించుకుంటున్న ప్రతి వందలో 9 మందికి పాజిటివ్ వస్తోంది. ఈ ఏడాది మార్చి 15వ తేదీన అత్యల్పంగా 0.33 శాతం పాజిటివిటీ రేట్ నమోదైంది. ఆ రోజు 60,263 మందికి టెస్టు చేస్తే, 204 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి పెరగడం మొదలైంది. ఆదివారం 73,275 మందికి టెస్టులు చేస్తే.. 6,551 (8.94 శాతం) మందికి వైరస్ సోకినట్లు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ సోమవారం ప్రకటించింది. మే రెండో వారం దాకా ఇలానే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు టెస్ట్ పాజిటివిటీ రేట్‌‌(టీపీఆర్‌‌‌‌) పది శాతం దాటితే, మినీ లాక్‌‌డౌన్లు పెట్టాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. రాష్ర్టంలోని కొన్ని జిల్లాల్లో టెస్ట్ పాజిటివిటీ రేట్‌‌ 20 శాతం దాకా నమోదవుతోంది. నిజామాబాద్‌‌, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది.

65,597 యాక్టివ్ కేసులు
రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం నమోదైన 6,551 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 4,01,783కు చేరుకున్నట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో 3,34,144 మంది కోలుకోగా, 65,597 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చూపించింది. మార్చి ఏడో తేదీ నాటికి కేసుల సంఖ్య 3,00,011 ఉండగా, గడిచిన 49 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. రాష్ర్టంలో మొదటి కేసు మార్చి రెండో తేదీన నమోదు కాగా, ఆగస్ట్ 21వ తేదీ నాటికి కేసుల సంఖ్య లక్ష దాటింది. తొలి లక్ష కేసులు నమోదవడానికి 173 రోజులు పట్టింది. తర్వాత 44 రోజుల్లోనే మరో లక్ష కేసులు వచ్చాయి. అక్టోబర్ నాలుగో తేదీ నాటికి కేసుల సంఖ్య 2,00,611కు చేరుకుంది. మూడో లక్ష నమోదవడానికి 154 రోజులు పట్టగా.. నాలుగో లక్షకు కేవలం 49 రోజులే పట్టింది. సెప్టెంబర్‌‌‌‌లో ఫస్ట్ వేవ్‌‌ పీక్‌‌కు వెళ్లి, తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీంతో మూడో లక్ష కేసులు నమోదు కావడానికి ఐదు నెలలు పట్టింది. సెకండ్ వేవ్‌‌ ఎఫెక్ట్‌‌తో చాలా తక్కువ సమయంలోనే నాలుగో లక్ష కేసులు వచ్చాయి.

వారంలో 186 మంది
రాష్ర్టంలో కరోనాతో ఆదివారం ఒక్క రోజే 43 మంది మరణించినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. వీరితో కలిపి కరోనా మృతుల సంఖ్య 2,042కు చేరింది. గత వారం రోజుల్లోనే (ఏప్రిల్ 19 నుంచి 25వ తేదీ దాకా) 186 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి కరోనా ఇన్‌‌ పేషెంట్ల సంఖ్య 20,009కి చేరుకుంది. ఇందులో 9,884 మంది ఆక్సిజన్‌‌పై, 5,691 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. ఇంకో 7,042 ఆక్సిజన్ బెడ్లు, 3,409 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నట్టు సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. కానీ ఏ హాస్పిటల్‌‌లోనూ వెంటిలేటర్లు ఖాళీగా లేవు. వెంటిలేటర్‌‌‌‌పై ఉన్న వాళ్లలో ఎవరైనా కోలుకుంటేనో, చనిపోతేనో తప్ప కొత్తగా ఎవరికీ వెంటిలేటర్ ఇచ్చే పరిస్థితి లేదని డాక్టర్లు చెబుతున్నారు.