కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కు అందరూ సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్లు, వలస కూలీలు, సిటీలో కోచింగ్ ల కోసం వచ్చిన విద్యార్థులు ఇక్కడే ఉండాలని, అటూ ఇటూ ప్రయాణాలు చేస్తే వైరస్ విజృభించే ప్రమాదం ఉందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎవరూ భయపడాల్సింది లేదని, కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీని ప్రజలంతా సహకరించాలని కోరారు. జనాలు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పోలీసులు, వైద్య సిబ్బందికి సహకారం అందించాలన్నారు.
చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా..
ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని, ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదం తప్పదని చెప్పారు సీఎం కేసీఆర్. వైరస్ ఇక విదేశాల నుంచి వచ్చే పరిస్థితి లేదని, ఇక్కడ ఉన్న వాళ్లకు తగ్గించుకుంటే చాలని అన్నారు. అయితే ప్రజలు అంటూ ఇటూ ప్రయాణాలు చేస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని, ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నానని అన్నారు. ఈ విపత్తు సమయంలో అంతా సహకరించాలని, ప్రధాని కూడా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని సూచించారని అన్నారు. పక్క రాష్ట్రాలు వాళ్లు కూడా తెలంగాణ బిడ్డల లాంటి వాళ్లేనని, ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూసుకుంటామని చెప్పారు.
ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు ఇక్కడ హాస్టల్స్ మూసేస్తారని భయపడుతున్నారని, ఆ పరిస్థితి రాకుండా చేస్తామని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నింపుతామని చెప్పారు. బీహార్, యూపీ, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి గృహ నిర్మాణం, నీటి పారుదల ప్రాజెక్టులు, పౌల్ట్రీ, రైస్ మిల్స్, ఇతర పరిశ్రమల్లోనూ పని చేస్తున్నారని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూడాలని ఆధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రతి జిల్లాలలో కలెక్టర్లు ఎంత ఖర్చైనా ఆకలి తీర్చే పనులు చూడాలన్నారు. ఆయా కంపెనీలు కూడా వాళ్లకు జీతాలు ఆపకూడదని ఆదేశించామన్నారు. అలాగే యాచకులు, ఆనాధాశ్రయాలు, నైట్ షెట్లర్లలో ఉండేవాళ్లకు ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
