చనిపోయినా వారికి టెస్ట్‌‌లో నెగిటివ్ వచ్చినా కరోనా కిందే లెక్క!

చనిపోయినా వారికి టెస్ట్‌‌లో నెగిటివ్ వచ్చినా కరోనా కిందే లెక్క!

న్యూఢిల్లీఆర్టీపీసీఆర్​ (ర్యాపిడ్​) టెస్టుల్లో చాలా వరకు తప్పుడు రిజల్ట్స్​ వస్తున్నాయని, దాని దృష్టిలో పెట్టుకుని శవాలకు సంబంధించి టెస్టుల్లో నెగెటివ్​ వచ్చినా కూడా కరోనా సస్పెక్టెడ్​ కేసుగానే లెక్కలోకి తీసుకోవాలని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్) సూచించింది. కాబట్టి కరోనా కాలం అయిపోయేంత వరకు శవాలను కోతల్లేకుండానే పోస్ట్​మార్టమ్​ చేయాలని సూచించింది. మెడికోలీగల్​ అటాప్సీకి సంబంధించి ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ విడుదల చేసింది. శవాలపై కరోనా వైరస్​ బతకతదని చెప్పింది. టైం పెరిగేకొద్దీ శవాలపై దాని మనుగడ క్షీణించిపోతుందని పేర్కొంది. అయితే అది శవాలపై ఎంతసేపు బతుకుతుందన్నది మాత్రం చెప్పలేమని, దానికి ఇప్పటిదాకా సైంటిఫిక్​ ఆధారాలేవీ లేవని వెల్లడించింది.

సెపరేట్​ సిబ్బంది ఉండాల్సిందే

శవాలను వేరే ప్రాంతాలకు తరలించేందుకు మార్చురీల్లో ప్రత్యేకమైన సిబ్బంది ఉండాల్సిందేనని ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. ఒకవేళ మార్చురీలో స్టాఫ్​ తక్కువగా ఉంటే వెంటనే అవసరమైనంత మేరకు సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది. ఆ నియామకాలకు అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ శాఖ సాయం తీసుకోవాలని చెప్పింది. శవాల అవయవాల నుంచి విడుదలయ్యే ఏరోసాల్స్​ నుంచి కూడా కరోనా సోకుతుందనడానికి ఆధారాలున్నాయని చెప్పింది. మృతదేహాల నోరు, ముక్కు నుంచి కూడా ద్రవాలు విడుదలవుతుంటాయని, దాని వల్ల కరోనా సోకే ముప్పు కూడా ఎక్కువేనని చెప్పింది. కాబట్టి కేవలం సర్ఫేస్​లను డిసిన్​ఫెక్టెంట్లతో క్లీన్​ చేసినంత మాత్రాన సరిపోదని, కరోనా వ్యాప్తిని అవి ఆపలేవని చెప్పింది. డబుల్​ బ్యాగుల్లో శవాలను పెట్టడం, పోస్ట్​మార్టం చేసేటప్పుడు ఒంటి నిండా సరైన పీపీఈలను వేసుకోవడం వల్ల డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి కరోనా సోకకుండా చూడొచ్చని చెప్పింది. కోతల్లేకుండానే శవాలకు పోస్ట్​మార్టం చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.

ఫొటోలు.. మాటలతోనే పోస్ట్​మార్టం

శవాలపై కోతల్లేకుండానే పోస్ట్​మార్టం చేయాలని సూచించిన ఐసీఎంఆర్​.. డబ్ల్యూహెచ్​వో సూచనల మేరకు ఫొటోలు, మాటలతోనే పోస్ట్​మార్టం చేయాలని చెప్పింది. శవంలోని ఫ్లుయిడ్స్​ పోస్ట్​మార్టం చేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కరోనా టెస్ట్​ రిజల్ట్స్​ రావాల్సి ఉంటే ఆ రిపోర్ట్​ వచ్చేదాకా శవాన్ని మార్చురీలోనే ఉంచాలని సూచించింది. ఆ తర్వాతే జిల్లా అధికారులకు ఇవ్వాలని చెప్పింది. శవాన్ని బ్యాగులో చుట్టేయాలని, అంతిమ సంస్కారాలకు ఎట్టిపరిస్థితుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పేర్కొంది. ఆ వచ్చిన ఇద్దరు శవానికి కనీసం ఒక మీటర్​ దూరం ఉండాలని, బ్యాగును ఓపెన్​ చేయకుండానే చనిపోయిన వ్యక్తిని చూడాలని సూచించింది. పోలీసుల సమక్షంలోనే అంతిమ సంస్కారాలు చేయాలని పేర్కొంది.  ఆచారాల పేరిట శవాన్ని ముట్టుకోవద్దని, శవానికి స్నానం చేయించడం లాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో చేయించొద్దని పేర్కొంది. శవాన్ని పూడిస్తే ఆ ప్రాంతం వరకు సిమెంట్​తో ఫ్లోరింగ్​ చేయాలని పేర్కొంది. ఒకవేళ కాల్చేస్తే ఆ మిగిలిన అస్థికలతో ఎలాంటి ప్రమాదం లేదనుకుంటేనే బంధువులకు ఇవ్వాలని చెప్పింది.

డాక్టర్​, పోలీస్​ సర్టిఫికెట్​ ఉంటేనే…

కరోనాతో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చనిపోయిన సందర్భాలకు సంబంధించి కూడా ఐసీఎంఆర్​ సూచలను చేసింది. అది మెడికో లీగల్​ కేసు కాకుంటే పోస్ట్​మార్టం రద్దుకు ఆ పేషెంట్​ను ట్రీట్​ చేసిన డాక్టర్​ సర్టిఫికెట్​ అవసరమని చెప్పింది. ఒకవేళ ఆస్పత్రిలో కాకుండా బయట చనిపోయి ఉంటే డాక్టర్లు దానిని మెడికో లీగల్​ కేసుగా లెక్కలోకి తీసుకోవాలని సూచించింది. అలాంటి శవాన్ని వెంటనే మార్చురీకి పంపించి, పోలీసులకు సమాచారమివ్వాలని సూచించింది. ఆ వ్యక్తి మరణానికి కారణమేంటో తెలుసుకోవడం కోసం పోస్ట్​మార్టం చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పింది. ఇలాంటి కేసుల్లో ఫోరెన్సిక్​ పోస్ట్​మార్టం వద్దనుకుంటే పోలీసుల నుంచి సర్టిఫికెట్​ తప్పనిసరి అని పేర్కొంది. హత్య, ఆత్మహత్య లేదా యాక్సిడెంట్​కు గురైన వ్యక్తి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయి.. ఆ తర్వాత కరోనా కన్ఫర్మ్​ లేదా సస్పెక్టెడ్​ కేసైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ ఫోరెన్సిక్​ అటాప్సీకి పంపించాలని పేర్కొంది. మెడికో లీగల్​ కేసు అయినా ఎలాంటి క్రైమ్​ లేదని తేలితే పోలీస్​ అధికారి నిర్ణయం మేరకు పోస్ట్​మార్టంను రద్దు చేయొచ్చని సూచించింది.

 

పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి