కరోనా వణుకు.. వ్యాక్సినేషన్కు మళ్లీ డిమాండ్

కరోనా  వణుకు.. వ్యాక్సినేషన్కు మళ్లీ  డిమాండ్

కరోనా టెన్షన్ మొదలవడంతో వ్యాక్సినేషన్ కు మరోసారి డిమాండ్ పెరిగింది. అయితే 90 శాతం సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రస్తుతం జరగడం లేదు. దీంతో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆయా సెంటర్లకు వెళ్తున్న జనం వెనుదిరుగుతున్నారు. ఈనేపథ్యంలో వ్యాక్సిన్ డోసులు పంపాలంటూ  పీహెచ్సీల నుంచి హెల్త్ డైరెక్టరేట్ కు హెల్త్ సిబ్బంది లేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ లో కొవిషీల్డ్,  కొవాగ్జిన్ ఉండగా.. కోర్బి వ్యాక్స్ టీకాలు లేవు. దీంతో వాటిని రాష్ట్రాలకు పంపాలంటూ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు.

పలు దేశాల్లో కరోనా ఉధృతి పెరిగింది. ఈనేపథ్యంలో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RTPCR టెస్టులు తప్పనిసరి చేస్తామని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య ఇటీవల వెల్లడించారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది RTPCR, యాంటిజెన్ టెస్టుల పరికరాలతో పాటు ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్ అని అనుమానం వస్తే శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలకు నిర్దేశించింది. ప్రికాషన్ డోస్ పై డ్రైవ్ లు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. 

దేశంలో కరోనా నాలుగో వేవ్ తప్పదని  హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. జనవరి మూడోవారం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమై... మార్చి నెల నుంచి మెల్లగా తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రోజుకి 30 వేల నుంచి 50 వేల వరకూ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంటే ‘BF7’ కావడంతో.. అది కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదని అంటున్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి ఉండటంతో  మళ్లీ కరోనా కరోనా రూల్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.