రాష్ట్రంలో మరో 8 జిల్లాల్లో కరోనా టెస్టులు

రాష్ట్రంలో మరో 8 జిల్లాల్లో కరోనా టెస్టులు

హైదరాబాద్​, వెలుగురాష్ర్టంలోని మరో 8 జిల్లాల్లో కరోనా టెస్టింగ్​ సెంటర్లను ప్రారంభించాలని సర్కార్​ నిర్ణయించింది. టీబీ టెస్టులు చేసే సీబీనాట్​(క్యాట్రిడ్జ్​ బేస్డ్​ న్యూక్లిక్​ యాసిడ్​ ఆంప్లిఫికేషన్​ టెస్ట్​) పరికరాలతో కరోనా టెస్టులు చేయనుంది. ఆ పరికరాల్లో కొన్ని మార్పులు చేసి కరోనా టెస్టులు చేసుకోవచ్చని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) ఇప్పటికే గైడ్​లైన్స్​ ఇచ్చింది.  అందుకు అవసరమైన వస్తువులనూ కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే టెస్టుల అనుమతి కోసం ఐసీఎంఆర్​కు రాష్ట్ర ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. రాష్ర్టంలో 30 సీబీ నాట్​ టెస్టింగ్​ సెంటర్లున్నాయి. తొలి దశలో ఇందులోని 9 సెంటర్లను కరోనా టెస్టింగ్​ సెంటర్లుగా మార్చాలని సర్కార్​ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్​లో కరోనా టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చెస్ట్​ హాస్పిటల్​లో టీబీ టెస్టింగ్​ సెంటర్​ ఉంది. దాంతో పాటు టీబీ టెస్టింగ్​ సెంటర్లున్న ఆదిలాబాద్​, గద్వాల్​, కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్​, నిజామాబాద్​, ఆసిఫాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లోనూ కరోనా టెస్టులు చేసేందుకు సర్కార్​ రెడీ అవుతోంది.

గంటకు 4 నుంచి 16  టెస్టులు

ప్రస్తుతం బయో సేఫ్టీ లెవల్​ 3 ల్యాబుల్లోనే కరోనా టెస్టులు చేసేందకు ఐసీఎంఆర్​ అనుమతిస్తోంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే ఆదిలాబాద్​, చెస్ట్​ హాస్పిటల్​(ఐఆర్​‌ఎల్​) సెంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఆ సెంటర్లకు అనుమతి వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మిగిలిన 7 సెంటర్లకు మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ఆర్టీపీసీఆర్​ పద్ధతిలోనే సీబీనాట్​తో టెస్టులు చేస్తారు. అందులో పాజిటివ్​గా తేలితే కరోనా కేసుగా తేలుస్తారు. ర్యాపిడ్​ టెస్ట్​లో లాగా మరోసారి చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గంటకు 4 శాంపిళ్లను మాత్రమే టెస్ట్​ చేసేందుకు వీలుంది. అవసరాన్ని బట్టి 3 షిఫ్టుల్లో 18 గంటల పాటు పనిచేస్తే 72 శాంపిళ్లను ఒక్క రోజులో టెస్ట్​ చేయొచ్చు. అందుకే గంటకు 16 టెస్టులు చేసే 4 పరికరాలను తెప్పిస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు రోజూ 1,570 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. సీబీ నాట్​ అందుబాటులోకి వస్తే మరో 1,112 టెస్టులు చేయొచ్చు. మొత్తంగా 2,682 టెస్టులు చేయొచ్చు. అవసరాన్ని బట్టి వికారాబాద్​ సహా మరికొన్ని జిల్లాల్లోనూ టెస్టింగ్​ సెంటర్లను పెట్టేందుకు సర్కార్​ ఆలోచిస్తోంది.