సర్కారు రేట్లకే కరోనా ట్రీట్ మెంట్ చేయాలే: ఈటల

సర్కారు రేట్లకే కరోనా ట్రీట్ మెంట్ చేయాలే: ఈటల

కరోనా పేరిట ప్రజలను భయబ్రాంతులకు గురి చేయొద్దని ప్రైవేటు హాస్పిటల్‌‌ యాజమాన్యాలకు మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం నిర్ణయించిన  ప్యాకేజీలకే ట్రీట్‌‌మెంట్ అందించాలన్నారు. పీపీఈ కిట్లు, మందులకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చార్జ్‌‌ చేయాలని సూచించారు. కరోనా ప్యాకేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలపై చర్చించేందుకు తెలంగాణ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సెక్రటేరియట్‌‌లో మంత్రితో భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కావని… రేట్లు పెంచాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు.  ఇందుకు ఈటల  స్పందిస్తూ  క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రైవేటు హాస్పిటల్స్‌‌పై కూడా ఉంటుందని  ప్రభుత్వం ప్రకటించిన ధరలకే ట్రీట్‌‌మెంట్ అందించాలని వారికి సూచించారు.   వైరస్ పాజిటివ్ ఉన్నా లక్షణాలు లేనివారికి ధైర్యం చెప్పి హోమ్ ఐసోలేషన్‌‌లో ఉండేలా సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. భేటీ వివరాలను మంత్రి ఈటల ఓ  ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు.  భేటీలో అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్, కిమ్స్‌‌ హాస్పిటల్స్‌‌ ఎండీ భాస్కర్‌‌‌‌రావు, యశోద హాస్పిటల్ నుంచి సురేశ్​ కుమార్, అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి దేవానంద్‌‌ పాల్గొన్నారు.