రిపోర్టులు వస్తలేవు​.. కిట్లు ఇస్తలేరు.. ఆర్టీపీసీఆర్​ టెస్టుల్లో గందరగోళం

రిపోర్టులు వస్తలేవు​.. కిట్లు ఇస్తలేరు.. ఆర్టీపీసీఆర్​ టెస్టుల్లో గందరగోళం


వరంగల్, వెలుగు: ఆర్టీపీసీఆర్​ టెస్టులు చేయించుకున్నోళ్లకు రిపోర్ట్ మొబైల్​కు రాకపోవడంతో వాళ్లు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీరా టెస్టు రిపోర్టులో కరోనా  పాజిటివ్​ అని తేలినా ఫాలో అప్​ చేసే దిక్కు లేకుండాపోయింది. పేషెంట్లకు ఐసోలేషన్​ కిట్ అందజేసి జాగ్రత్త చెప్పాల్సిన మెడికల్​ ఆఫీసర్ల వద్ద పేషెంట్ల వివరాలు కూడా  ఉండటం లేదు. 
శాంపిల్​ తీసుకొని..!
వరంగల్​ ఎంజీఎంకు పేదల ఆసుపత్రిగా పేరుండటంతో ఏ సమస్య వచ్చినా చుట్టుపక్కల జిల్లాల నుంచి పేషెంట్లు ఇక్కడికే వస్తుంటారు. కరోనా టెస్టుల కోసం రోజూ వందల మంది ఎంజీఎంకే వస్తున్నారు. ఇక్కడికి సగటున 200 మంది ర్యాపిడ్​ టెస్టు చేయించుకుంటుండగా.. వంద మంది వరకు ఆర్టీపీసీఆర్​ టెస్టు కోసమని వస్తున్నారు. ఇక్కడ శాంపిల్స్​ సేకరించే సిబ్బంది వాటిని ఆఫీసర్ల ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్​ కాలేజీ (కేఎంసీ) వైరాలజీకు పంపిస్తున్నారు. రిపోర్ట్ మొబైల్ కే మెసేజ్ వస్తుందని చెప్పి పేషెంట్లను ఇంటికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. కానీ రెండు, మూడు రోజులైనా రిపోర్ట్​ రాకపోవడంతో పేషెంట్లు గందరగోళానికి గురవుతున్నారు. మళ్లీ ఎంజీఎంకు వెళ్లి అడిగితే అక్కడి స్టాఫ్​ మాత్రం కేవలం శాంపిల్స్​ పంపడం వరకే తమ బాధ్యతన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శాంపిల్ ఇచ్చిన పేషెంట్లకు పాజిటివ్​, నెగె టివ్​ ఏదో ఒకటి తేలేదాక ఫాలోఅప్ చేయాల్సిన ఎంజీఎం ఉన్నతాధికారులు కూడా చేతులు దులుపేసుకుంటున్నారు. దీంతో పేషెంట్లు నేరుగా కేఎంసీకి వెళ్లి రిపోర్టులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా సోకిన వ్యక్తులను ఇలా రిపోర్టుల కోసం తిప్పుకుంటుండటం కూడా వైరస్​ వ్యాప్తి మరింత పెరగడానికి కారణమవుతోంది. 
పాజిటివ్​ వచ్చినొళ్లను అలర్ట్​ చేస్తలేరు
ఎంజీఎంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్న వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. ఇక్కడ శాంపిల్స్​ ఇచ్చిన తర్వాత కేఎంసీ నుంచి వచ్చే రిపోర్ట్​ ఆధారంగా పేషెంట్లను అలర్ట్​ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి ఆఫీసర్లు అలాంటి చర్యలేమీ తీసుకోవడం లేదు. ఫలితంగా కరోనా పేషెంట్లకు ఎలాంటి సమాచారం అందకపోగా.. పాజిటివ్​ వచ్చినవారికి ఐసోలేషన్​ కిట్​ కూడా అందడం లేదు. పేషెంట్లకు కలుగుతున్న ఇబ్బంది గురించి  ఎంజీఎం సూపరింటెండెంట్​ నాగార్జున రెడ్డిని వివరణ కోరగా.. ఎంజీఎంలో ఇన్​ పేషెంట్లుగా చేరిన వాళ్లకు ట్రీట్​మెంట్ ఇస్తున్నామని, ఓపీలో ఆర్టీపీసీఆర్​ శాంపిల్స్ ఇచ్చిన వారి సమాచారం మళ్లీ తమకు రావడం లేదన్నారు. ఆ విషయం తమ పరిధి కాదని, ఆసుపత్రిలో ఆ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపల్​ సంధ్యారాణిని సంప్రదిస్తే పోర్టల్​ లో సమస్య వల్ల పేషెంట్లకు మెసేజ్​లు వెళ్లడం లేదన్నారు. ఆర్టీపీసీఆర్​ రిజల్ట్స్​ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బాధితులకు మెడికల్​ కిట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్​వో లలితాదేవి చెప్పారు.