మే నెలాఖరు వరకు జర పైలం

మే నెలాఖరు వరకు జర పైలం

సింప్టమ్స్ ఉన్నోళ్లకే టెస్టులు చేస్తాం 
అత్యవసరమైతేనే హాస్పిటల్​కు రావాలి
కేసుల నమోదులో భారీ పెరుగుదల లేదు
ఇంకొన్నాళ్లు ఫంక్షన్లు వాయిదా వేసుకోండి
18 ఏండ్లు దాటినోళ్లకు వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచో చెప్పలేం
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కట్టడికి వచ్చే మూడు నాలుగు వారాలు చాలా కీలకమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌, డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. మే నెలాఖరు దాకా ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత కరోనా కంట్రోల్​ అయ్యే చాన్స్​ ఉందన్నారు. వారం రోజుల నుంచి కేసుల నమోదులో పెద్ద మార్పు లేదని చెప్పారు. బుధవారం హైదరాబాద్ కోఠిలోని తన ఆఫీసులో డీఎంఈ రమేశ్‌‌రెడ్డితో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ‘‘వారం రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు కొంతమేర కుదుట పడుతున్నాయి. కేసుల నమోదులో స్థిరత్వం కనిపిస్తోంది. భారీగా పెరుగుదల లేదు. ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు, ప్రభుత్వ చర్యలతో వైరస్ వ్యాప్తి కొంత తగ్గింది. జనం ఇప్పటికే ఫంక్షన్లు వాయిదా వేసుకున్నారు. ఇంకొంత కాలం వాయిదా వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. 

కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలా మంది హాస్పిటళ్లకు పరిగెడుతున్నారని, దీనివల్ల అవసరమైన వాళ్లకు బెడ్లు దొరకడం లేదని అన్నారు. ఆక్సిజన్ లెవల్స్‌ తగ్గితే, సింప్టమ్స్ తీవ్రంగా ఉంటేనే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలని సూచించారు. ఇవేవి లేకుంటే.. డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే ఉండి మెడిసిన్ వాడాలని సూచించారు. రాష్ర్టంలో మరిన్ని ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే 50 వేలకుపైగా బెడ్లు ఉన్నాయని చెప్పారు. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వందల మంది హెల్త్ స్టాఫ్ వైరస్ బారిన పడ్డారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని డీహెచ్ తెలిపారు. అయినా తమ స్టాఫ్ పనిచేస్తున్నారని, ఇది చూసైనా జనాలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
పాండమిక్ లో డెత్స్ ఆపలేరు: డీఎంఈ రమేశ్‌
జ్వరం తగ్గకపోయినా, ఆయాసం వచ్చినా, ఇంకేదైనా కోమార్బిడ్ కండిషన్ ఉన్నా, ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించినా హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి సూచించారు. ఎర్లీ స్టేజ్‌లో హాస్పిటల్స్​కు వచ్చే వాళ్లు వంద శాతం కోలుకునే చాన్స్ ఉందని చెప్పారు. అయితే అందరూ హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేదని, జిల్లాల్లోని హాస్పిటళ్లలో చేరితే సరిపోతుందన్నారు. గాంధీలో ఉన్న సౌకర్యాలే జిల్లా హాస్పిటల్స్‌లోనూ ఉన్నాయని తెలిపారు. పాండమిక్‌లో డెత్స్‌ ఎవరూ ఆపలేరని.. అయితే మిగతా రాష్ర్టాలతో పోలిస్తే మన దగ్గర డెత్స్‌ తక్కువగా ఉన్నాయని అన్నారు. గాంధీ, టిమ్స్‌, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లకు పేషెంట్లు చివరి క్షణంలో వస్తున్నారని, అందుకే అక్కడ మరణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. సీరియస్ కండీషన్‌ ఉంటే వెంటనే దగ్గర్లోనే హాస్పిటల్‌లో చేర్పించాలని, దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి టైమ్ వేస్ట్ చేయొద్దన్నారు. ఇలా చేయడం వల్లే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పెద్ద హాస్పిటళ్లలో నార్మల్ పేషెంట్లను పెడితే, క్రిటికల్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడం కష్టమవుతుందన్నారు. ఎక్కడి వాళ్లకు అక్కడే ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్ లైన్లు వేస్తున్నామని చెప్పారు.

వ్యాక్సిన్ కోసం రిజిస్టర్​ చేసుకోండి 
కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు


మే ఒకటో తేదీ నుంచి 18 ఏండ్లు దాటిన వాళ్లంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  అయితే ఈ గ్రూప్ వాళ్లకి వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. వ్యాక్సిన్ లభ్యత, కొనుగోలు తదితర విషయాలపై స్పష్టత వచ్చాక ప్రారంభ తేదీని ప్రకటిస్తాం. 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. సెకండ్ డోసు ఎక్కడైనా వేయించుకోవచ్చు. మంగళవారం మరో లక్షన్నర డోసులు వచ్చాయి. సెకండ్ డోసు వాళ్లకే ప్రియారిటీ ఇవ్వాలని హాస్పిటళ్లకు సూచించాం.                      - పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

ఆయాసం ఉంటేనే ఆస్పత్రిలో చేరాలి
జ్వరం తగ్గకపోయినా, ఆయాసం వచ్చినా, ఇంకేదైనా కోమార్బిడ్ కండీషన్ ఉన్నా, ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించినా వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ కావాలి. ఎర్లీ స్టేజ్‌‌లో హాస్పిటల్స్‌‌కు వచ్చే వాళ్లు వంద శాతం కోలుకునే చాన్స్ ఉంది. అయితే అందరూ హైదరాబాద్‌‌ దాకా రావాల్సిన అవసరం లేదు. జిల్లాల్లోని హాస్పిటళ్లలో చేరితే సరిపోతుంది. గాంధీలో ఉన్న సౌకర్యాలే జిల్లా హాస్పిటల్స్‌‌లోనూ ఉన్నాయి.                            - డీఎంఈ రమేశ్‌‌ రెడ్డి,9154170960

ట్రీట్‌‌మెంట్ చార్జీలు, టెస్టుల చార్జీలు, వ్యాక్సినేషన్ లభ్యత సహా ఏ వివరాలు, ఫిర్యాదులకైనా ఫోన్​ చేయాల్సిన నంబర్​ ఇది. వాట్సప్​  కూడా చేయొచ్చు. లేదా 104 నంబర్‌‌‌‌లో సంప్రదించాలి.