
- ఇంటికొచ్చి టీకా వేస్తరు
- గ్రేటర్ హైదరాబాద్‌లో ఇయ్యాల్టి నుంచి స్పెషల్‌డ్రైవ్
- 200 మొబైల్ వాహనాలతో 10 రోజులపాటు ప్రోగ్రామ్
హైదరాబాద్, వెలుగు: ఇంటింటికీ వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమ వారం నుంచి పది రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను వైద్య ఆరోగ్య శాఖ, కంటోన్మెంట్ బోర్డుతో కలిసి నిర్వహించనుంది. గ్రేటర్‌లోని 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్‌లోని 360 వాడలు, కాలనీల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే సిటీలో 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వాళ్లకు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లనున్నారు. దాదాపు 200 స్పెషల్ మొబైల్ కొవిడ్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
సిటీలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు బల్దియా ఈ డ్రైవ్ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ, ఎంటమాలజీ టీమ్స్.. ముందుగా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారి జాబితాలు సేకరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ వెళ్లి మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ల షెడ్యూల్ పాంప్లెట్స్ పంపిణీ చేస్తారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఆయా కాలనీలు, బస్తీలు 100% వ్యాక్సినేటెడ్ అని బ్యానర్ ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. ఆయా కాలనీ సంఘాలకు బల్దియా ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేస్తుందన్నారు. ఈ డ్రైవ్‌ను బల్దియా ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్విలు ఆకస్మిక తనిఖీ చేస్తారు.