వీర్య కణాల్లోనూ కరోనా వైరస్ !

వీర్య కణాల్లోనూ కరోనా వైరస్ !
  • చైనా డాక్టర్ల రీసెర్చ్ లో ఆసక్తికర అంశాలు

షాంఘై : కరోనా వైరస్ ఇందు లేదు అందుగలదని కాదు ఎక్కడైనా ఉండగలనంటూ సవాల్ విసురుతోంది. ఇప్పటికే నీరు, గాలి, దుమ్ములో వైరస్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లకు తాజాగా మరో విషయం తెలిసింది. అదే మగాళ్ల వీర్యకణాల్లోనూ కరోనా వైరస్ బతికే ఉంటుందంట. కరోనా ఎఫెక్ట్ కు గురైన వారు కోలుకున్న తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారి వీర్యకణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు చైనా డాక్టర్లు గుర్తించారు. షాంఘైకి మున్సిపల్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు దీనిపై పరిశోధన చేశారు. జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య చైనాలో కరోనా బారిన పడి కోలుకున్న 38 మంది వీర్యాన్ని సేకరించి పరీక్షలు చేశారు. వీరిలో ఆరుగురిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వీరు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వీర్య కణాల్లో మాత్రం కరోనా వైరస్ బతికే ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను జామా నెట్ వర్క్ ఓపెన్ జనరల్ లో చైనా డాక్టర్లు ప్రచురించారు. ఐతే కరోనా వైరస్ వీర్య కణాల్లో ఎన్ని రోజుల పాటు ఉంటుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
సెక్యువల్ ట్రాన్ మిషన్ అవుతుందా?
కరోనా వైరస్ వీర్యకణాల్లో బతికున్నట్లు తేలటంతో ఇప్పుడు కొత్త అనుమానం మొదలైంది. సెక్స్ ద్వారా కరోనా ఇతరులకు వ్యాప్తి అవుతుందా? దీనిపై డాక్టర్లు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకైతే సెక్యువల్ ట్రాన్ మిషన్ ద్వారా కరోనా సోకినట్లు ఆధారాలు లభించలేదు. సార్స్ కోవ్ -2 ను కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొంతమంది వీర్యకణాల్లో ఉన్నట్లు గుర్తించామని ఐతే ఇది తమకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని డాక్టర్ డయాన్ జెంగ్ లీ తెలిపారు. పురుషుల వీర్యకణాల్లో చాలా వైరస్ లు ఉంటాయని ఆయన చెప్పారు. కరోనా పేషెంట్లు కోలుకున్న కొంతకాలం పాటు శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని ఇప్పటికే డబ్య్లూహెచ్ఓ హెచ్చరించింది. తాజా స్టడీ ద్వారా ఈ సూచనలకు మరింత బలం చేకూరినట్లైంది.