కరోనా ఎప్పటికీ పోకపోవచ్చు: డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక

కరోనా ఎప్పటికీ పోకపోవచ్చు: డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక
  • లాక్​డౌన్ ఆంక్షల సడలింపులపై ఆందోళన
  • వైరస్​తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచన

జెనీవా: కరోనా వైరస్ ఎప్పటికీ పోకపోవచ్చని, దానితో కలిసి జీవించడం నేర్చుకోవాల్సి ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్​డౌన్ సడలింపులు ఇస్తున్న సందర్భంగా డబ్ల్యూహెచ్​వో ఈ వార్నింగ్ ఇచ్చింది. వైరస్ ను పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యం కాకపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మునుపెన్నడూ చూడని వైరస్ ప్రపంచం అంతటా విస్తరించింది. దీనిపై మనం ఎప్పుడు విజయం సాధిస్తామో ఊహించడం కష్టం”అని WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ బుధవారం జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.

ఇది కూడా హెచ్ఐవీ లాగే..
ప్రపంచం అంతటా హెచ్​ఐవీ వ్యాపించినట్లుగానే ఈ కొత్త వైరస్ విస్తరించిందని, అది ఎప్పటికీ పోదని మైఖేల్ ర్యాన్ కామెంట్ చేశారు. ‘‘హెచ్​ఐవీ పోలేదు. ఈ వైరస్ కూడా అంతే. ప్రపంచంలో సగం జనాభా పూర్తి లాక్​డౌన్​లోనే ఉండగా.. కొన్ని దేశాలు సడలింపులు ఇవ్వడంతో వైరస్ విస్తరించే ప్రమాదం ఉన్నది”అని ఆయన హెచ్చరించారు. ప్రపంచం అంతటా సాధారణ పరిస్థితులు రావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, దేశాలన్నీ వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు గట్టి చర్యలు కొనసాగించాలని సూచించారు. వైరస్ ను జయించేందుకు వ్యాక్సీన్ ను కనుగొని.. దానిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.