
కరోనా వైరస్ బారినపడిన వారిలో వైరస్ మహా అయితే 8 రోజులు బతికుంటుంది. కానీ ఒక క్యాన్సర్ పేషంట్‌లో మాత్రం 105 రోజులు బతికుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఆ వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఈ ఘటన అమెరికాలోని కిర్క్‌ల్యాండ్‌లో జరిగింది.
యూఎస్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో వైరాలజిస్ట్‌గా పనిచేసే సీనియర్ డాక్టర్ విన్సెంట్ మన్‌స్టర్ ఈ విషయం గురించి ఒక అధ్యయనాన్ని విడుదల చేశారు. ఈ వైరస్‌ను మానవ శరీరం నుంచి తొలగించడానికి ఎంత సమయం పడుతుందో తమకు తెలియదని ఆయన అన్నారు. ఈ వైరస్ బారినపడిన వాళ్లు ఎంతకాలం చురుకగా ఉంటారో కూడా చెప్పలేమని ఆయన అన్నారు. ఈ వ్యాధికి సంబంధించిన పలు విషయాలను ఆయన సెల్ జర్నల్‌లో పంచుకున్నారు.
వాషింగ్టన్‌లోని కిర్క్‌ల్యాండ్‌కు చెందిన ఒక 71 ఏళ్ల మహిళ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. అయితే ఆమెకు తీవ్రమైన రక్తహీనత ఏర్పడటంతో ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు కరోనా టెస్ట్ చేస్తే.. ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దాంతో ఆమెను కొన్ని వారాల పాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. ప్రతిరోజూ రోగి యొక్క ఎగువ శ్వాసకోశం నుంచి సేకరించిన నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేస్తున్నప్పుడు 70 రోజుల వరకు వైరస్ సజీవంగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. అయితే 105వ రోజు తర్వాత కూడా మహిళ శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోలేదని డాక్టర్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మా కూడా ఆ మహిళ బాడీపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని డాక్టర్ మన్‌స్టర్ తెలిపారు. ‘ఇలా జరుగుతుందని మేం ముందే ఊహించాం. ఆమె శరీరం ఎప్పుడూ యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయలేదు. వ్యాధికారక పరిణామాలకు గల ఆధారాలు లభించనందున ఈ వ్యాధి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. చాలామంది రోగనిరోధక శక్తిని తగ్గించే జబ్బుల వల్ల ఈ వైరస్ బారిన పడతారు’ అని ఆయన అన్నారు.
For More News..