ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్ లో ఏర్పాటు చేయనున్న మెడికల్​ కాలేజీతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. జిల్లా ఆస్పత్రి పైభాగంలో నిర్మిస్తున్న 50 పడకల భవనానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ కోసం 25 మంది రెసిడెంట్ డాక్టర్స్ నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ ​పర్సన్ ​విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం
పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని, చారిత్రక ఆడెల్లి మహా పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఆడెల్లి పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఆయన భూమిచేశారు. ఇప్పటికే ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేశామన్నారు. బోథ్​ నుంచి ఆడెల్లి వరకు రూ. 10 కోట్లతో అంతర్రాష్ట్ర రహదారి, రూ. 6.60  కోట్లతో ఆదిలాబాద్ మొండిగుట్ట రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్​రామిరెడ్డి పాల్గొన్నారు.

ప్రజలను పక్కదారి పట్టించడానికే బీజేపీ ధర్నాలు
ఆదిలాబాద్,వెలుగు: ప్రజలను పక్కాదారి పట్టించడానికే బీజేపీ లీడర్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్​అయ్యారు. సోమవారం స్థానికంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు, పెంన్షన్​  కార్డులు పంపిణీ చేశారు. అనంతరం జైనథ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు యువకులు టీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ లీడర్లు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమపథకాలు చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి,  పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు పవన్ నాయక్, ప్రకాశ్, లక్ష్మణ్, ఆనంద్, సలీం, మీషు  తదితరులు పాల్గొన్నారు.

పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది

ఆదిలాబాద్,వెలుగు: కేసీఆర్ 57 ఏళ్ల నిండిన ప్రతీ ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, ఒక్కో గ్రామంలో 50 మంది దరఖాస్తులు చేసుకుంటే కనీసం ఐదుగురికి కూడా పింఛన్లు మంజూరు కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ లో కలెక్టర్ సిక్తాపట్నాయక్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాయల్​శంకర్​మాట్లాడుతూ గ్రామాల్లో టీఆర్ఎస్ లీడర్లు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లుగా అర్హులు సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో అర్హులకు పెన్షన్లు మంజూరు చేయకపోతే ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటిని ముట్టడిస్తామన్నారు. నిరసనలో లీడర్లు జోగు రవి, దినేశ్​ మాటోలియ, లోక ప్రవీణ్ రెడ్డి, రాందాస్, సతీశ్​ యాదవ్, శ్రీనివాస్, ధోని జ్యోతి పాల్గొన్నారు. 

సీఎం రిలీఫ్​ ఫండ్​తో పేదలకు మేలు
నార్నూర్,వెలుగు: ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్​ఫండ్ ఎంతో మేలు చేస్తోందని నార్నూర్​ వైస్​ఎంపీపీ మర్షివనే యోగేశ్​చెప్పారు. సోమవారం గాదిగూడ మండలంలోని మెడిగూడ గ్రామానికి చెందిన సర్వదే శాలబాయికి మంజూరైన రూ.20,000ల సీఎం రిలీఫ్​ఫండ్​చెక్కును ఆయన అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు కిషన్, మనోహర్, బలరాం, నాగు, ఇంద్రజిత్ పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీకి చెందిన 37 మంది పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి  పీఏ కృష్ణం రాజు బట్టలు అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు ఎనగందుల నారాయణ, కొక్కుల ప్రదీప్, పారంకుశం శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, ఇర్ఫాన్, దివాకర్, శ్రీహరి, శోభన్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన దళితులపై కేసు

నర్సాపూర్(జి),వెలుగు: నర్సాపూర్ (జి) దళితులపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై పాకాల గీత తెలిపారు. శుక్రవారం స్థానిక బస్టాండ్​సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కొంతమంది దళితులు దళిత బంధు టీఆర్ఎస్ పార్టీ వారికి ఇస్తున్నారని, అర్హులైన వారికి ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించారు.  గ్రామానికి చెందిన బరుకుంట అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వారిపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

దళిత బంధు అడిగితే కేసులా?
అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వాలని అడిగితే కేసులు నమోదు చేయడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్​ఫైర్​అయ్యారు. ప్రభుత్వం ఎంతమంది అర్హులకు దళితబంధు ఇచ్చిందో శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్​చేశారు. అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేయాలనుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట లీడర్లు బి. మంజుల, కరుణ, అబ్దుల్ వాహెద్, అబ్దుల్ తబ్రేజ్ తదితరులు ఉన్నారు.

ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా సతీశ్​
ఆదిలాబాద్ ​టౌన్​, వెలుగు; ఆదిలాబాద్​ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా రాంపెల్లి సతీశ్​​ను నియమించినట్లు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు ఏలేటి భీంసేన్​రెడ్డి, పవార్​ మనోజ్ పాల్గొన్నారు.


డీడీలు కట్టిన వారికి న్యాయం చేయాలె

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రాజీవ్ స్వగృహ ఇళ్ల స్థలాల కోసం డీడీలు కట్టిన వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం దరఖాస్తుదారులు కలెక్టరేట్​ఎదుట ముందు ధర్నా చేశారు. 2007 సంవత్సంలో ఇళ్ల స్థలాల కోసం తాము రూ.3000 డీడీ తీసి ఆఫీసర్లకు అందజేసినట్లు తెలిపారు. 2014 లో కొందరు దరఖాస్తు దారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారని మిగితా 200ల మందికి స్థలాలు ఇవ్వలేదని తెలిపారు. న్యాయం చేయాలని లేదంటే ఆందోళ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఇంటి స్థలాల సాధన సమితి అధ్యక్షుడు పి.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రాంచందర్​రెడ్డి, ట్రెజరర్​ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో దుర్గమాతకు పూజ
బోథ్,వెలుగు: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోథ్ మండలం దన్నూర్ (బి) గ్రామంలో   నిర్వహిస్తున్న దుర్గామాత పూజల్లో సోమవారం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ పాల్గొన్నారు. అమ్మవారికి పూలమాల, వస్త్రాలు సమర్పించి  ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ లీడర్లు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

రాంలీలా కోసం వివేక్​ రూ. లక్ష విరాళం
బెల్లంపల్లి,వెలుగు: హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నిర్వహించనున్న రాంలీలా కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ మేరకు హిందూ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 5న జరగనున్న రాంలీల కార్యక్రమానికి వివేక్ ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. పట్టణంలో వివేక్​ వెంకటస్వామి సేవలను ఆయన కొనియాడారు.