పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దండి

 పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దండి
  •      ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం
  •     పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దాలని నీట్  యూజీ పరీక్షలు నిర్వహించే నేషనల్  టెస్టింగ్  ఏజెన్సీ (ఎన్టీఏ) ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోపాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకునేందుకు, పేపర్  లీకేజీలను నివారించేందుకు అవసరమైతే టెక్నాలజీ వాడాలని సుప్రీంకోర్టు సూచించింది. నీట్  పరీక్షలు మళ్లీమళ్లీ నిర్వహించే అవసరం రాకుండా చూడాలని పేర్కొంది. 

నిర్వహించిన పరీక్షలే మళ్లీ నిర్వహిస్తే విద్యార్థుల ప్రయోజనాలు నెరవేరవని తెలిపింది. సెప్టెంబరు 30 లోగా తమకు సమగ్ర నివేదిక అందించాలని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్  డీవై చంద్రచూడ్  నేతృత్వంలోని బెంచ్  గడువు ఇచ్చింది. నీట్  పరీక్ష ప్రక్రియను విశ్లేషించేందుకు, మరింత సమర్థంగా పరీక్ష నిర్వహించేందుకు ఇస్రో మాజీ చీఫ్  డాక్టర్  కె.రాధాకృష్ణన్  నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. 

కమిటీ ఇచ్చే నివేదికను, సూచనలను రెండు వారాల్లో అమలు చేయాలని విద్యా శాఖకు కూడా బెంచ్  ఆదేశాలు జారీచేసింది. అలాగే.. అర్హత పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాలను కేటాయించే ప్రక్రియ, అభ్యర్థుల గుర్తింపు, ఎగ్జామ్  సెంటర్లను సీసీటీవీల ద్వారా పర్యవేక్షించే విషయంలో కమిటీకి బెంచ్  ఎనిమిది సూచనలు చేసింది. క్వశ్చన్  పేపర్లు ట్యాంపర్  కాకుండా నిర్దేశిత కేంద్రాలకు పంపాలని ఎన్టీఏను ఆదేశించింది. నీట్  2024 ప్రశ్నపత్రాలను లాక్డ్  బాక్సుల్లో రవాణా చేసేటపుడే లీకై ఉండవచ్చని బెంచ్  పేర్కొంది.

 పట్నా, హజారీబాగ్ లో మాత్రమే క్వశ్చన్  పేపర్  లీకైందని, దేశవ్యాప్తంగా లీక్  కాలేదని తెలిపింది. అయినప్పటికీ, ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలని ఎన్టీఏను బెంచ్  ఆదేశించింది.