రికార్డుల ట్యాంపరింగ్ పై చర్యలేవీ?

రికార్డుల ట్యాంపరింగ్ పై చర్యలేవీ?
  • గరిడేపల్లి తహసీల్దార్ ​ఆఫీస్​లో పలువురు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు

గరిడేపల్లి, వెలుగు: గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల ట్యాంపరింగ్ సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల తహసీల్దార్ ఆఫీస్​లోని భూ రికార్డుల్లో ఓ మహిళ పేరును చెరిపేసి, మరొకరి పేరు ఎక్కించిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ తేజస్ నంద్​లాల్ పవార్ సీరియస్ అయ్యారు. విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

 వారు తుది నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది పైరవీలు చేయిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే నెల రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఎస్సై నరేశ్​ను వివరణ కోరగా.. తహసీల్దార్​కార్యాలయంలో రికార్డుల ట్యాంపరింగ్ పై కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. ఇటీవల పని ఒత్తిడి కారణంగా ఆలస్యమైందని, త్వరలోనే పూర్తి చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. 

ధ్రువపత్రాలు, స్కీంలకు వసూళ్లు!

తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, కొందరు అధికారులపై రికార్డుల ట్యాంపరింగ్ తోపాటు అవినీతి ఆరోపణలున్నాయి. ఆఫీస్​ బయట ఉన్న జిరాక్స్ షాపులతో కుమ్మక్కై రేషన్ కార్డులు, కుటుంబసభ్యుల ధ్రువపత్రాలు, కల్యాణలక్ష్మి వంటి సేవల కోసం వచ్చిన ప్రజల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారన్న చర్చ జరిగింది. ఫలితంగా తహసీల్దార్​ఆఫీస్​ఎదుట కొంతమంది వ్యక్తులు పెట్టిన నెట్, జిరాక్స్​సెంటర్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాటిని మరోచోట ఏర్పాటు చేశారు.