35 స్కూళ్లు.. 278 అప్లికేషన్లు.. యాదాద్రి జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు డిమాండ్

35 స్కూళ్లు.. 278 అప్లికేషన్లు.. యాదాద్రి జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు డిమాండ్
  • యాదాద్రి జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్​ పోస్టులకు డిమాండ్​​
  • ఆయా పోస్టులకు 116 అర్జీలు
  • స్క్రూటినీ కంప్లీట్​ 
  • అభ్యర్థులను ఎంపిక చేయనున్న కలెక్టర్ ​నేతృత్వంలోని కమిటీ

యాదాద్రి, వెలుగు: ప్రీ ప్రైమరీ స్కూల్స్​లో టీచర్, ఆయా పోస్టులకు డిమాండ్​పెరిగింది. పాఠశాలల్లో స్టూడెంట్ల సంఖ్య కంటే టీచర్, ఆయా పోస్టులకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కింద రెండో విడతలో యాదాద్రి జిల్లాకు 37 ప్రీ ప్రైమరీ స్కూళ్లు  మంజూరయ్యాయి. వీటిని అంగన్వాడీ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించనున్నాయి. 2025–-26 విద్యాసంవత్సరానికి గానూ యూకేజీలో అప్లికేషన్లు తీసుకున్నారు. 35 పాఠశాలల్లో 204 మంది పిల్లలను చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. మిగతా రెండు స్కూళ్లకు ఒక్క అప్లికేషన్​కూడా రాకపోవడంతో వాటిని అధికారులు పక్కన పెట్టారు.

టీచర్ పోస్టులకు 278 దరఖాస్తులు

ప్రతీ ప్రీ ప్రైమరీ స్కూల్​లో టీచర్, ఆయా పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్​రిలీజ్​ చేశారు. టీచర్​కు ఇంటర్.. ఆయా పోస్టుకు ఏడో తరగతి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థులు సదరు పాఠశాల ఉన్న గ్రామంలోనే నివసించాల్సి ఉంటుంది. 35 పాఠశాలల్లో టీచర్​పోస్టులకు 278, ఆయా పోస్టులకు 116 అప్లికేషన్లు వచ్చాయి. 

ఇద్దరు చొప్పున అభ్యర్థులు..

టీచర్, ఆయా పోస్టులకు వచ్చిన అప్లికేషన్లను ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​స్క్రూటినీ చేసింది. అభ్యర్థుల్లో టీచర్​ ట్రైనింగ్​పొందిన వారిని, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించింది. ఆయా పోస్టుల్లోనూ ఇదే పద్ధతి పాటించారు. ఒక్కో టీచర్, ఆయా పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను అర్హులుగా తేల్చారు. 

ఎంపికకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ 

కలెక్టర్​నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూల్​కోసం ఒక గదిని, అందులో వసతుల కల్పనకు రూ. 1.50 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. పిల్లలకు మార్నింగ్​ స్నాక్స్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.