నాపై అవినీతి ఆరోపణలను రుజువు చేయాలి

నాపై అవినీతి ఆరోపణలను రుజువు చేయాలి
  •  జిల్లాలోనూ అనేక ఆరోపణలు
  •  స్టే తెచ్చుకొని కంటిన్యూ కావడంపై విమర్శలు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సీఈవోగా ఉన్న అట్లూరి వీరబాబుపై ఏపీలో వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమని తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది.  2014 నుంచి 2017 వరకు విశాఖపట్నం డీసీసీబీ సీఈవోగా పని చేసిన టైంలో రూ.3 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సహకార శాఖ ఆధ్వర్యంలో జరిగిన 51 ఎంక్వైరీ(అంతర్గత విచారణ) వీరబాబును దోషిగా తేల్చింది. సీఈవో వీరబాబుతోపాటు మరో సీఈవో, ఇద్దరు ఈవోలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సహకార శాఖ రిజిస్ట్రార్​ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ సీఈవోగా పని చేస్తున్న వీరబాబుపై ఇక్కడ కూడా పలు ఆరోపణలు వస్తుండడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.   

ఇక్కడా ఆరోపణలే..

ఖమ్మం డీసీసీబీలో 2013 నుంచి 2018 వరకు ఉన్న పాలకవర్గం హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు రాగా, ఇక్కడ కూడా 51 ఎంక్వైరీ జరిగింది. అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. రూ.70 లక్షల వరకు గిఫ్టుల పేరుతో దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో ప్రస్తుత బ్యాంకు సీఈవోగా ఉన్న అట్లూరి వీరబాబు స్వయంగా త్రీటౌన్​ పోలీస్​స్టేషన్ లో గత పాలకవర్గంపై కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి పాలకవర్గం, డైరెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే విశాఖలో సీఈవో వీరబాబు వల్ల బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వాటిల్లిందని, సొసైటీలకు గిఫ్టులు ఇచ్చామంటూ వీరబాబు రూ.17 లక్షలు ఖర్చు చేయడం నిధుల దుర్వినియోగమేనని ఎంక్వైరీలో తేలగా, దానిపై కేసు నమోదు కాకుండా స్టే తెచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు సీఈవోగా ఆయన ఎంపికపై పలు ఆరోపణలున్నాయి. గతంలో ఖమ్మంలో సీఈవోగా పని చేసిన ఒక ఆఫీసర్​పై 51 ఎంక్వైరీ నడుస్తుందనే కారణంతో ఇంటర్వ్యూకు అర్హత లేదని నిలిపి వేసిన ఆఫీసర్లు, అదే 51 ఎంక్వైరీ నడుస్తున్న వీరబాబును మాత్రం ఈ రూల్ ను పట్టించుకోకుండా సీఈవోగా నియమించడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు.  

అక్రమాలు ఇవిగో..

ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీలోనూ పలు అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. డీసీసీబీ పరిధిలోని బ్రాంచుల్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన అలారం కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. బ్యాంకుల్లో రూ.43 లక్షలతో ఏర్పాటుచేసిన ‘బగ్లర్’​అలారాలు రెండేళ్ల నుంచి పనిచేయకున్నా, వాటిని నిర్వహిస్తున్న కంపెనీకి ఇటీవల యాన్యువల్ మెయింటనెన్స్​ చార్జీ కింద డబ్బులు చెల్లించడంపై విమర్శలున్నాయి. ఇక బ్యాంకుల్లో అటెండర్లుగా పని చేసేందుకు అవుట్ సోర్సింగ్ ద్వారా రీసెంట్ గా 28 మందిని ఒక ఏజెన్సీ ద్వారా నియమించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నియామకాల్లో ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు బ్యాంకులో చెత్త అమ్మకంలోనూ కక్కుర్తి పడ్డారనే  ఫిర్యాదులున్నాయి. స్క్రాప్​ను అమ్మగా వచ్చిన రూ.5 లక్షల్లో నుంచి రూ.2 లక్షలు జమ చేసి, మిగిలిన రూ.3 లక్షలు పక్కదారి పట్టించారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కుక్కునూరు, కూనవరం మండలాలు ఏపీలో విలీనం కావడంతో అక్కడ ఉన్న బ్రాంచ్​లను సారపాక, అన్నపురెడ్డిపల్లికి మార్చారు. ఈ బ్రాంచ్​ల కిరాయి విషయంలోనూ బేరసారాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఖమ్మంలోని బైపాస్​ రోడ్​లో ఉన్న బ్రాంచ్​ కిరాయి రూ.40 వేలుండగా, సారపాకలో ఏకంగా రూ.38 వేలు నెల అద్దెగా నిర్ణయించడం వెనుక అక్రమాలు జరిగాయని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. చర్చి కాంపౌండ్ లో ఉన్న బ్రాంచ్ ను ముస్తఫా నగర్​ కు మార్చడం, ఏన్కూరులో రెంట్ కాంట్రాక్ట్  కాల పరిమితి ఉన్నా మరో బిల్డింగ్ కు మార్చడం వెనుక ఇలాంటి కారణాలే ఉన్నాయని అంటున్నారు. 

ఆరోపణలను రుజువు చేయాలి

విశాఖపట్నం డీసీసీబీలో జరిగిన 51 ఎంక్వైరీ మీద అక్కడ స్టే ఇచ్చారు. అప్పుడు ఉన్న పాలకవర్గం, అధికారులంతా స్టే తెచ్చుకున్నారు. 2017 వరకు సీఈవోగా అక్కడ పని చేశాను. 2018లో ఎంక్వైరీ జరిగిన విషయం కూడా నాకు తెలియదు. కొన్ని చోట్ల బ్రాంచ్​లను మంచి లొకేషన్​కు మార్చడం కోసం ఉన్న వాటిని ఖాళీ చేశామే తప్ప అందులో డబ్బులు చేతులు మారలేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే కిరాయిలు నిర్ణయించాం. నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు వాటిని రుజువు చేయాలి.

-అట్లూరి వీరబాబు, 
సీఈవో, డీసీసీబీ, ఖమ్మం