
దేశ ఆర్థికవ్యవస్థ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ, గత ఏడు దశాబ్దాలలో వ్యవసాయ రంగ ఉత్పత్తి 600% పెరిగినప్పటికీ, దేశ ఆర్థికవ్యవస్థ ఐదు ట్రిలియన్ల స్థాయికి ఎదుగుతున్నప్పటికీ రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడడంలేదు. నిరంతరం శ్రమిస్తూ వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలను, మార్కెట్ ధరల ఆటుపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజలకు అన్ని రకాల ఆహార పదార్థాలను కారుచౌకగా సమకూర్చే వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు లభించక కొట్టుమిట్టాడుతున్నారు.
పెరుగుతున్న కుటుంబ అవసరాలు, వ్యవసాయ వ్యయాలను భరించలేక కొందరు చిన్న, సన్నకారు రైతులు భూములు కౌలుకు ఇచ్చి వ్యవసాయాన్ని వీడిపోతున్నారు. మరికొందరు అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్న భూమిలో కొంతభాగాన్ని విక్రయించుకొని కౌలు రైతులుగా దిగజారుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో తగిన గిట్టుబాటు ధరలు లభించడంలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర శాస్త్రీయ పద్ధతులలో నిర్ణయించకపోవడం వలన రైతుల ఆదాయాలు పెరగక వారి వార్షిక ఆదాయాలు కుంచించుకుపోతున్నాయి. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో రైతులు దోపిడీకి గురి అవుతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా అవినీతికి పాల్పడి కల్తీ విత్తనాల అమ్మకాన్ని నియంత్రించలేకపోతున్నారు. ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలో కూడా పేద రైతులను పీడించుకొని దోపిడీ చేసే శక్తులు అనేకం ఉన్నాయి. బ్యాంకులు జాతీయకరణ చేసి 55 సంవత్సరాలు గడిచినప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలు పల్లెపల్లెకు విస్తరించినప్పటికీ రైతులు మాత్రం సంపూర్ణ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
రైతుల ఆదాయాలకు గండి
ఇప్పటికీ సన్న చిన్నకారు, మధ్యతరగతి రైతులు ప్రైవేటు ఫైనాన్స్ పై ఆధారపడక తప్పడం లేదు. రైతే రాజు అని గత 60 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయస్థాయి నినాదాలు ఇచ్చి ఎన్నో గొప్పలు చెపుతున్నాయి. కానీ, వాస్తవ రూపంలో కష్టించి పంటలు పండించే రైతుకు ఒరిగిందేమీ లేదు. దీనికితోడు వ్యవసాయ సంబంధిత అధికారుల అవినీతి రైతుల ఆదాయాలను గండి కొట్టడమేకాక నిరంతరం వారు అప్పులపాలు కావడానికి కారకులు అవుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ భూసంబంధాలలో చోటుచేసుకున్న సమస్యలు, రుగ్మతలను ఆసరాగా తీసుకొని, ప్రతినెల వేలకు వేల జీతాలు, కరువు భత్యాలు పొందుతున్న ప్రభుత్వ అధికారులు నిత్యం రైతులను పీడించుకు తింటున్నారని క్షేత్రస్థాయి పరిశోధనలు ఎన్నో వెల్లడించాయి.
ధరణి పోర్టల్ ద్వారా అనేక దశాబ్దాల క్రితమే భూస్వాములు, జమీందారుల నుంచి కొనుగోలు చేసుకున్న భూములను కొనుగోలు చేసిన రైతులకు పట్టా చేయకుండా తిరిగి భూస్వాములకే పట్టాలు ఇచ్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానికి, రెవెన్యూ అవినీతి అధికారులకే దక్కింది. తమ భూములు తమకే దక్కాలని రెవెన్యూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఫలితం శూన్యమే అయింది. ఈ అవినీతి దుర్గంధం మండల స్థాయి నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు కూడా వ్యాపించింది అనడంలో సందేహం లేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో చేతివాటం
ప్రస్తుతం ధరణి స్థానంలో భూభారతి అవతరించింది. ఇక ప్రధానంగా భూమి సంబంధాలలో ఉండే అనేక లొసుగులను ఆసరాగా తీసుకొని రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులు రైతులను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ యంత్రాంగంలోని ఈ అవినీతి మహమ్మారి రైతులపాలిట శాపంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి నిగూఢమైన లక్ష్యంతో ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి రైతుల భూములు గత కాలపు నాటి భూకామందుల కోసం కొల్లగొట్టడానికి అవినీతి అధికారులను ఉపయోగించుకున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి అధికారుల సహాయంతో ఈ కుంభకోణం జరిగిందని ఇటీవల మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయి ప్రతి చిన్న పనికి రైతులను పీడించుకుని ముంచుతున్నారు. ఒక పక్కన గిట్టుబాటు ధరలు లేక ఆదాయాలు పెరగడంలేదు. మరోపక్క రైతులను దోచుకునే అధికారిక, అనధికారిక శక్తులను ప్రభుత్వం నియంత్రించడం లేదు. కల్వకుంట పరిపాలనలో ఈ అవినీతి మరింత పెరిగిపోయింది. అందులో రెవెన్యూ శాఖ దోపిడీ ప్రధానమైనది అని ఒక క్షేత్రస్థాయి పరిశోధనలో తేలింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చేతివాటం లేకుండా ఏ ఒక్క చిన్న పని కూడా జరగడం లేదని బాధితులు వాపోతున్న సంఘటనలు అనేకం.
రైతులు చైతన్యవంతులు కావాలి
ధరణి పోర్టల్ ద్వారా తలెత్తిన అనేక సమస్యలు రైతులను కష్టాలపాల్జేశాయి. అనేకమంది రైతుల ఆత్మహత్యలకు ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణమైంది. అందుకే రైతుల భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రస్తుత ప్రభుత్వం భూభారతిని ప్రవేశపెట్టింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలను ఆసరాగా తీసుకొని అవినీతికి పాల్పడకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. ఇంకా పాతకాలపు అవినీతి కొనసాగితే రైతులు స్పందించి అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారం అందించాలి. అవినీతి నిరోధక శాఖ అధికారులకు తగినవిధంగా సహకరించి ఈ అవినీతి మహమ్మారిని నియంత్రించడానికి, తమను తాము రక్షించుకోవడానికి కృషి చేయాలి. రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో చైతన్యంతో కృషి చేయాలి.
అప్పుడే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా రైతుల భూ సంబంధాల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని రైతులు, రైతు సంఘాలు, బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు రైతులకు బాసటగా నిలవాలి. అవినీతి అధికారుల బండారం బయటపెట్టి అవినీతిని నియంత్రించడంలో సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలలో చైతన్యం లేకుంటే ఏ ప్రభుత్వమైనా సరిగా పనిచేయదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే అన్నారు. అందుకే రైతులు చైతన్యవంతులై తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి. లంచం ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకునేవారు వెనుకాడరని గుర్తించాలి. రైతులందరూ ఈ సమస్యను సంఘటితంగా ఎదుర్కోవాలి. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తుందని గుర్తిద్దాం.
- కూరపాటి
వెంకట్ నారాయణ,
కేయూ ప్రొఫెసర్ (రి)