కేసులు నమోదవుతున్నా మారని ఆఫీసర్ల తీరు

కేసులు నమోదవుతున్నా మారని ఆఫీసర్ల తీరు

మెదక్ ​జిల్లాలో తరచూ ఏసీబీ దాడులు.. కేసులు నమోదవుతున్నా మారని ఆఫీసర్ల తీరు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రైడ్ లు చేస్తూ, కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా జిల్లాలో  అక్రమాలకు పాల్పడుతున్న కొందరి రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. రెవెన్యూ ఆఫీసులలో లంచం ఇవ్వనిదే ఏ పని కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

మెదక్, వెలుగు : భూ సమస్యల శాశ్వత  పరిష్కారానికి ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ధరణి పోర్టల్​ను అందుబాటులోకి తెచ్చింది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. మెదక్​ జిల్లాలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే అర్జీలలో భూముల సమస్యలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. భూ విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, సర్వే నంబర్లు తప్పుగా పడటం, పట్టా పాస్​ పుస్తకాలు జారీ కాకపోవడం, పట్టా భూములు ఆన్​ లైన్​లో లావాణి భూములుగా నమోదు కావడం, ప్రొహిబిటెడ్​ జాబితాలో ఉండటం, తదితర సమస్యలున్నాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం బాధిత రైతులు రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ అక్రమ పద్ధతుల్లో పనులు చక్కబెట్టే ప్రయ్నతం చేస్తున్నారు. భూ విస్తీర్ణం, ఆయా ప్రాంతాల్లో ఉన్నభూముల విలువలను బట్టి రూ.లక్షల్లో లంచం డిమాండ్​ చేస్తున్నారు. కొందరు అధికారులు డైరెక్ట్​గా లంచం తీసుకుంటుండగా, మరికొందరు ఆఫీస్​లో ప్రైవేట్​ వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
ఇదీ పరిస్థితి..!

నర్సాపూర్​ మండలం చిప్పల్​తుర్తిలో 112 ఎకరాలకు సంబంధించి ఎన్ వో సీ జారీ చేసేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేసిన కేసులో  2020 అక్టోబర్​లో అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్ చెడ్ తహసీల్దార్ సత్తార్ పై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. తూప్రాన్​ మండలం కోనాయిపల్లి గ్రామంలో నీలమ్మ అనే మహిళకు సర్వే నంబర్​ 69లో 4 ఎకరాల భూమి ఉండగా,  2020లో ఆ భూమి సత్తయ్య అనే వ్యక్తి పేరు మీదకు మారింది. రెవెన్యూ అధికారులు నీలమ్మ చనిపోయిందని చెప్పి ఆమె పేరిట ఉన్న భూమిని మరొకరి పేరు మీదకు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న నీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా తూప్రాన్​తహసీల్దార్​ తోపాటు, భూమి తన పేరు మీద పట్టా మార్పిడి చేయించుకున్న సత్తయ్యపై కేసు నమోదు చేశారు. కాగా సాదా బైనామా ఆధారంగా సత్తయ్యకు భూమి సంక్రమించిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

మనోహరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా  ఓ ప్రైవేట్​ వ్యక్తిని  పెట్టుకొని ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ లు చేసుకున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. దీనికి సంబంధించి వీడియో వాట్సప్​ గ్రూప్​లలో వైరల్​ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి హసీల్దార్​ ఆఫీస్​ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. గురువారం చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మీడియేటర్​ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఎకరా 33 గుంటల  భూమిని అక్రమంగా పట్టా పాస్​ బుక్​ లో నమోదు చేస్తామని చెప్పి రూ.4.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో నుంచి రూ.2.70 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ ఆఫీసుల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేలా చర్యలు చేపట్టాలని పలువురు  కోరుతున్నారు.