ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన పత్తి ఉత్పత్తి

ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన పత్తి ఉత్పత్తి
  • కరువు, అధిక వర్షాలతో తగ్గుతున్న దిగుబడి
  • సెల్లర్లకు తగ్గుతున్న మార్జిన్లు

న్యూఢిల్లీ: చాలా దేశాల్లో కరువు, అధిక వర్షాలు, వడగాల్పులు పత్తి పంటను దెబ్బకొడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని పండించే దేశమైన ఇండియాలో​ భారీ వర్షాలు,  తెగుళ్లు పత్తి పంటకు శాపంగా మారాయి. నిన్నమొన్నటి దాకా ఇతర దేశాలకు పత్తిని ఎగుమతి చేయగా, ఇప్పుడు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. 
చైనాలో హీట్ వేవ్ కారణంగా రాబోయే పంట గురించి ఆందోళనలు ఉన్నాయి. ఈసారి అక్కడ పంట దిగుమతులు భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద వస్తు ఎగుమతిదారు అయిన అమెరికాలోనూ కరువు పత్తిని నాశనం చేస్తోంది. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగుబడులు పడిపోతాయని సాగురంగంలోని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన బ్రెజిల్ తీవ్రమైన వేడి, కరువుతో పోరాడుతోంది. ఇక్కడ ఇప్పటికే దిగుబడి దాదాపు 30శాతం తగ్గింది. వాతావరణ మార్పుల వల్ల సంభవించిన ఈ వైపరీత్యాల వల్ల పత్తి సరఫరా అన్ని చోట్లా బాగా తగ్గింది. దీంతో వీటి ధరలు 30 శాతం వరకు పెరిగాయి. 
ఈ సంవత్సరం ప్రారంభంలో ధరలు 2011 నుండి అత్యధిక స్థాయిని తాకాయి.  దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుస్తుల సరఫరాదారుల మార్జిన్లు తగ్గాయి. టీ-షర్టులు, డైపర్ల నుంచి పేపర్  కార్డ్‌‌‌‌‌‌‌‌బోర్డ్ వరకు ప్రతిదాని ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. చిల్డ్రన్స్ ప్లేస్ సీఈఓ జేన్ ఎల్ఫెర్స్ ఈ విషయమై మాట్లాడుతూ పత్తి ధరల పెరుగుదల తమకు చాలా పెద్ద సమస్య అని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల తరువాత పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

బ్రెజిల్​లో పరిస్థితి దారుణం

బ్రెజిల్​లో పత్తి రైతుల సంఘం అబ్రపా లెక్కల ప్రకారం ఇక్కడ కరువు కారణంగా ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ఆగిపోయింది. ఈ దేశంలో ఈ సంవత్సరానికి కోతలు దగ్గరపడుతున్నాయి. ఉత్పత్తి ఈసారి 2.6 మిలియన్ టన్నుల కంటే తక్కువ ఉంటుందని అంచనా.  బ్రెజిల్​ పత్తిపంట సాగుతో 10శాతం వాటా కలిగిన అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు బోమ్ ఫ్యూటురో గ్రూప్​కు మునుపటి సీజన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే దిగుబడి 27శాతం తగ్గింది.

ఈ దేశంలోని బహియా రాష్ట్రంలో సావో డెసిడెరియోలో సాగు చేస్తున్న జూలియో సెజర్ బుసాటో కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఎండిపోవడం వల్ల దూది గింజల సంఖ్య తగ్గుతోందని, దేశంలోని అన్ని ప్రధాన పెరుగుతున్న ప్రాంతాలలో వీటి బరువు తగ్గుతున్నదని ఆయన అన్నారు. అమెరికా ఈ నెలలోనే పంట కోతల సీజన్​ మొదలయింది. ఈసారి ఉత్పత్తి 28శాతం పడిపోతుందని అంచనా. కరువు కారణంగా అమెరికా ప్రభుత్వం కొలరాడో నది నుండి నీటిని రేషన్ పద్ధతిలో సరఫరా చేస్తోంది. ప్రపంచంలోని పత్తి ఎగుమతుల్లో సగభాగం అమెరికా,  బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ నుంచే ఉంటుంది.

అయితే ఆసియా, యూరప్​ దేశాలు ఎకానమీలు బలహీనంగా ఉన్నందున ఈసారి దుస్తుల కొనుగోలు కూడా తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. అయినప్పటికీ రాబోయే నెలల్లో మాత్రం పత్తి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని నాష్‌‌‌‌‌‌‌‌విల్లేలోని హెడ్జ్‌‌‌‌‌‌‌‌పాయింట్ గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ సీనియర్ రిలేషన్ మేనేజర్ ఆండీ రయాన్ అన్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌తో సహా ప్రాంతాలలో అకాల వర్షాలు పత్తి నాణ్యతను తగ్గించాయి. దీంతో బ్రెజిల్​ వంటి దేశాల రైతులు సాగు విస్తీర్ణాన్నిపెంచడంపై ఫోకస్​ చేశారు.