- క్వింటాల్ కు రూ.4,500 నుంచి రూ.7 వేలు
- మరోవైపు సీసీఐ కొర్రీలతో పత్తి రైతుల గగ్గోలు
- ఉమ్మడి జిల్లాలో 66,391 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు
- మిల్లుల్లో క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.500 మేర కటింగ్
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మార్కెట్లో పత్తికి ప్రైవేట్వ్యాపారులు సిండికేట్గా మారి క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.7 వేలు ఫిక్స్ చేశారు.. మరోవైపు సీసీఐ కొర్రీలతో పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందని, 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ పత్తి తీసుకొచ్చినా, స్లాట్బుక్చేయకుండా వచ్చినా కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని, ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే వారు తక్కువ రేటుకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 24 నుంచి కొనుగోళ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 20 వరకు 4,409 మంది రైతుల నుంచి 66,391 క్వింటాళ్ల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5 సీసీఐ సెంటర్లలో 2,221 మంది రైతుల నుంచి 36,622 క్వింటాళ్లు, జగిత్యాల జిల్లాలో ఒక సెంటర్ ద్వారా 85 మంది రైతుల నుంచి 813.80 క్వింటాళ్లు, పెద్దపల్లి జిల్లాలోని 3 సెంటర్ల ద్వారా 360 మంది రైతుల నుంచి 5,650 క్వింటాళ్లు, కరీంనగర్ జిల్లాలోని 13 సెంటర్లలో 1,743 మంది రైతుల నుంచి 23,306 క్వింటాళ్ల పత్తిని కొన్నది.
8 నుంచి 12 శాతం వస్తేనే..
పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన లేక స్లాట్ బుక్ చేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలువురు సీసీఐకి పత్తిని అమ్మినా.. మిల్లుల్లోకి వెళ్లిన తర్వాత తేమ శాతం పేరిట క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.500 వరకు కటింగ్ పెడుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా.. 6 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వస్తుండటంతో పెట్టిన పెట్టుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు.
7 క్వింటాళ్లు దాటితే కొనట్లే
రైతులు మద్దతు ధర పొందేందుకు పత్తిని సీసీఐ సెంటర్తీసుకెళ్తే.. అక్కడ నిబంధనల ప్రకారం ఒక్కో రైతు నుంచి 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో పత్తిని పండించిన వారు సీసీఐ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు కావొస్తున్నా గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తిని కొనుగోలు చేయడంలో సీసీఐ వెనకబడింది. తమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిబంధనలు తొలగించాలని రైతులు కోరుతున్నారు.
రెండు రోజుల క్రితం రూ.6,400
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నిత్యం బహిరంగ వేలం ద్వారా పత్తిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోళ్ల కంటే ముందే పత్తి వ్యాపారులంతా సిండికేట్ గా మారి, మార్కెట్ కు తీసుకొచ్చిన పత్తికి క్వింటాల్ కు రూ.4,500 నుంచి రూ.7 వేల లోపు ధర నిర్ణయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తేమ శాతం పేరిట కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల క్రితం జమ్మికుంటలోని ఓ జిన్నింగ్ మిల్లులో పత్తి మార్కెట్ లో జరిగే బహిరంగ వేలం కంటే ముందే క్వింటాల్ కు రూ.6,400 చొప్పున కొనుగోలు చేశారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న ఆ మిల్లుకు చేరుకొని ప్రైవేట్ వ్యాపారులను ప్రశ్నించారు. మార్కెట్లో ధరలతో పోల్చితే మిల్లుల్లోకి వచ్చేసరికి క్వింటాల్ కు రూ.600 నుంచి రూ.800 చొప్పున తక్కువ ధర నిర్ణయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
