అభివృద్ధి అధికార పార్టీకేనా.. మా వార్డుల్లో ఎప్పుడు?

అభివృద్ధి అధికార పార్టీకేనా..  మా వార్డుల్లో ఎప్పుడు?
  •     ‘పట్టణ ప్రగతి’లో కౌన్సిలర్​ నిలదీత

యాదాద్రి, వెలుగు : మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి నిర్వహిస్తున్న సర్కారును ‘అభివృద్ధి అధికార పార్టీ కౌన్సిలర్లకేనా?' అని ప్రతిపక్ష కౌన్సిలర్​ ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్​, భూదాన్​ పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో శుక్రవారం పట్టణ ప్రగతి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల అభివృద్ధి గురించి ఆలేరు, మునుగోడు ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి, కలెక్టర్​ పమేలా సత్పతి, కమిషనర్లు ఆఫీసర్లు వివరించారు. ఈ సందర్భంలోనే చౌటుప్పల్​లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌన్సిలర్​ కాసర్ల మంజూల (బీజేపీ) అభివృద్ధిపై ప్రశ్నించారు. ‘అధికార పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లోనే చేస్తారా? మా వార్డుల్లో చేయరా?’ అని ప్రశ్నించారు. ‘ప్రజాప్రతినిధులుగా గెలిచిన మేం మా వార్డుల్లో పనులు చేయలేకపోతున్నాం. 

కేవలం అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్ల వార్డులోనే పనులు జరుగుతున్నాయి. ఇలా అయితే మమ్మల్ని  నమ్మి ఓటేసిన ప్రజలకు మేమేం చెప్పుకోవాలి’ అని నిలదీశారు. దీంతో వేదికపై ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి మాట్లాడుతూ ‘విడతల వారీగా అన్ని వార్డుల్లో అభివృద్ధి జరుగుతుంది’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలకు బ్యాంక్​ లింకేజీ లోన్లకు సంబంధించిన చెక్కులను అందించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు ముగ్గులు వేశారు. బతుకమ్మ పాటలు పాడారు.