ఈవ్ టీజర్లకు రాచకొండ సీపీ కౌన్సిలింగ్

ఈవ్ టీజర్లకు రాచకొండ సీపీ కౌన్సిలింగ్

యువతులు, మహిళల్ని వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సీపీ చౌహన్ హెచ్చరించారు. మహిళా భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఆడపిల్లల్ని వేధించే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో సీపీ చౌహాన్ పాల్గొన్నారు. ఆకతాయి చేష్టలు, గృహ హింస, పని ప్రదేశాల్లో వేధింపుల తదితర అనేక ఇబ్బందుల నుంచి మహిళల్ని రక్షించేందుకు షీ టీమ్స్ చర్యలు చేపడుతోందని తెలిపారు. 

మహిళలకు ఎదురయ్యే భౌతిక, లైంగిక వేధింపులు నుంచి రక్షణ కోసం రాచకొండ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని సీపీ ప్రకటించారు. పురుషులు ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని హితవు పలికారు. గడిచిన 2 నెలల్లో ఈవ్ టీజర్ల మీద 118 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. వాటిలో 33 FIR, 41 పెట్టీ కేసులు, 44 కౌన్సెలింగ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మొత్తం 247 మంది ఆకతాయిలను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ స్పష్టం చేశారు.