నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లాలో బుధవారం నిల్వ చేసిన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ రైడ్​లో టాస్క్​ఫోర్స్, లా అండ్​ ఆర్డర్​ పోలీసులు, అగ్రికల్చర్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. కర్నాటక రాష్ట్రం యాద్గిర్​ జిల్లా గురుమిట్కల్‌ తాలూకా మల్లాపూర్‌ గ్రామానికి చెందిన జాజాపురం నర్సప్ప రాయచూరు శక్తినగర్‌లోని బ్రహ్మయ్య కాటన్‌ మిల్లులో 9 క్వింటాళ్ల పత్తి విత్తనాలు కొన్నాడు. వీటిని నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని తన మామ పూజారి మల్లప్ప ఇంట్లో దాచాడు. 

ఇందులో కొన్ని విత్తనాలు ఇప్పటికే ఉట్కూరు మండలం నిడుగుర్తికి చెందిన కురవ బుగ్గప్పకు అమ్మగా, మిగతా వాటిని కూడా అమ్మేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆఫీసర్లు బుధవారం దాడులు చేసి నిల్వ ఉంచిన రూ. 8.85 లక్షల విలువైన 8 క్వింటాళ్ల నకిలీ హెచ్‌టీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను తీసుకొచ్చిన  నర్సప్పపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ చెప్పారు. విత్తనాలు కొనే రైతులు జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్‌ ఉన్న వ్యాపారుల వద్దే విత్తనాలు కొనాలని, తప్పనిసరిగా రిసిప్ట్‌ తీసుకోవాలని సూచించారు.