రేపు బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

రేపు బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు మంగళవారం చేపట్టనున్నారు. దీని కోసం బద్వేలు పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. 4 హాళ్లలో 28 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. గత శనివారం అక్టోబర్ 30వ తేదీన 281 కేంద్రాల్లో ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా 59.58 శాతం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 
కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మైక్రో అబ్జర్వర్లు, సూపర్ వైజర్ల పర్యవేక్షణలో మొత్తం 10 రౌండ్లలో ఓట్లు లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నికల్లో పాల్గొన్న, పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లకు ఇప్పటికే పాసులు జారీ పూర్తయింది. రేపు ఉదయం 8 గంటలకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లను తెరచి ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తరలిస్తారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లు లెక్కించడం మొదలుపెడతారు. దీనికంటే ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.