ఆదిలాబాద్ జిల్లాలో.. అసెంబ్లీ ఎన్నికల నేడే ఓట్ల లెక్కింపు

ఆదిలాబాద్ జిల్లాలో.. అసెంబ్లీ ఎన్నికల నేడే ఓట్ల లెక్కింపు
  • మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు.. 22 రౌండ్స్   
  • ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు 
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు 

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రజాతీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తేలబోతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో 1‌‌0 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి మార్పు తథ్యమని ప్రతిపక్షాలు చెబుతుంటే.. మరోసారి తామే అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సెంటర్​లో బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల కౌంటింగ్​కేంద్రాలను ఏర్పాటు చేయగా.. నిర్మల్, ఖానాపూర్, ముథోల్​కు సంబంధించి నిర్మల్​లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేశారు.  మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలోని హజీపూర్​లోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో.. ఆసిఫాబాద్, సిర్పూర్​కు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అధికారులు అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇనుప కంచెలతో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ సాగనుంది.

19 కౌంటింగ్ బృందాలు.. 14 టేబుళ్లు

ప్రతి నియోజకవర్గానికి 19 చొప్పున కౌంటింగ్ బృందాలు, 14 కౌంటింగ్ టేబుల్లు, 3 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. ఆదిలాబాద్, సిర్పూర్, మంచిర్యాల​ నియోజకవర్గాలకు 21 రౌండ్లలో ఓట్లు లెక్కించనుండగా.. చెన్నూర్, బెల్లంపల్లి కౌంటింగ్​17 రౌండ్లలో పూర్తవుతుంది. ముథోల్​లో 23, మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 22 రౌండ్లలో లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.

ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బందిని నియమించారు. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ స్టాఫ్ ఇలా మొత్తం 124 మంది ఏజెంట్లు పనిచేయనున్నారు. కేంద్రాల్లోనే అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

భద్రత కట్టుదిట్టం..

అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రం, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా కేంద్ర బలగాలతో పాటు స్థానిక డీఏస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల చుట్టూ ప్రైవేటు వ్యక్తులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల ప్రధాన మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కేవలం కౌంటింగ్​పాస్​తోపాటు పర్మిషన్ ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించేలా పక్కాగా ప్రణాళిక వ్యవస్థను రూపొందించినట్లు జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు.

కౌంటింగ్ కేంద్రం లోపల నిర్వహించే సిబ్బంది సెల్​ఫోన్లు, అగ్గిపెట్టెలు, ఇంకు బాటిల్ వంటి వాటిని లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. కౌంటింగ్ అయిన తర్వాత 24 గంటల వరకు విజయోత్సవ ర్యాలీలు, టపాసులు పేల్చేందుకు అనుమతి లేదని పోలీసు యంత్రంగా స్పష్టం చేస్తోంది.