
సిటిజన్ షిప్ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గౌహతి, డిబ్రూగఢ్ లలో కర్ఫ్యూ విధించారు. సైన్యాన్ని దించారు. త్రిపురలోనూ పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేసింది. మరోవైపు వివిధ చోట్ల స్థిరపడ్డ శరణార్థులు మాత్రం సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో అస్సాం రగిలిపోతోంది. రాజధాని దిస్ పూర్ సహా ప్రధాన నగరాలైన గౌహతి, డిబ్రూగఢ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. గౌహతీలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రోడ్లపై టైర్లు వేసి నిప్పంటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గౌహతిలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కెనన్స్ ప్రయోగించారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. అయినా.. జనం వెనక్కి తగ్గలేదు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దిస్ పూర్ లో ఓ బస్సుతో పాటు కొన్ని ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. రోడ్డుపై ఉన్న వాహనాలతో పాటు, పోలీసుల వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితులు చేయిదాటడంతో గౌహతిలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు కర్ప్యూ కొనసాగుతుందని గౌహతి పోలీస్ కమిషనర్ చెప్పారు.
గౌహతి, డిబ్రూగఢ్ మాత్రమే కాకుండా అస్సాం అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్మీ, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. మరిన్ని బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆర్మీ అధికారులను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అసోంలోని.. లఖింపుర్, తిన్ సుఖియా, ధీమాజి, చారైడియో, శివవసాగర్, జోర్హాట్, గోలాఘాట్, కామరూప్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొన్ని సంఘాలు రైల్ రోకోకు పిలుపునివ్వడంతో… అసోంలో 12 రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో 10 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. గౌహతి యూనివర్సిటీ, కాటన్, డిబ్రూగఢ్ యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశారు. గౌహతి సిటీ వార్ జోన్ లా మారడంతో ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఎయిర్ పోర్ట్ లోనే చిక్కుపోయారు. డిబ్రూగఢ్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు గంటలకొద్ది అవస్థలు పడ్డారు.
మరో ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని అగర్తలలోనూ ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. యువత పెద్దయెత్తున ఆందోళనల్లో పాల్గొంటోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వివిధ సంఘాలతో సీఎం విప్లవ్ దేవ్ చర్చించి ఆందోళనలు విరమించేలా చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ లకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండడంతో అక్కడ పెద్దగా ఆందోళనలు జరగడంలేదు.
ఢిల్లీలోనూ నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగారు. ఒక మతాన్ని టార్గెట్ చేసి బిల్లు తీసుకొచ్చారన్నారు ఆందోళనకారులు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. బీజేపీ హెడ్ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు కార్యకర్తలు. జైపూర్, భోపాల్, ముంబయిలలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. జైపూర్ లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ లు నిరసనల్లో పాల్గొన్నారు.
సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లును శరణార్థులు స్వాగతిస్తున్నారు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి వచ్చిన శరణార్థుల్లో హిందువులు, సిక్కులే ఎక్కువగా ఉన్నారు. వారంతా పండగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఓ శరణార్థి మహిళ తన బిడ్డకు నాగరిక్తా అని పేరు పెట్టుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన తాము ఏడేళ్లుగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నామని ఆ మహిళ తెలిపింది.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడంతో… బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో శరణార్థుల కుటుంబాలతో కలసి బీజేపీ కార్యకర్తలు సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్ కతాలో స్వీట్లు తినిపించుకున్నారు.
Rajasthan: Pakistani Hindu refugees in Jaisalmer celebrate after Parliament passes #CitizenshipAmendmentBill2019 pic.twitter.com/DxWcB5SuiK
— ANI (@ANI) December 11, 2019