కరోనా పేషెంట్లే టార్గెట్: టిమ్స్‌లో భార్య కాపలా.. భర్త చోరీ

కరోనా పేషెంట్లే టార్గెట్: టిమ్స్‌లో భార్య కాపలా.. భర్త చోరీ
  • భార్యభర్తల అరెస్ట్.. రూ.10 లక్షల బంగారం, ఫోన్లు సీజ్
  • ఇంకా ముత్తూట్, అట్టికాల్లో చాలా బంగారం తాకట్టు

హైదరాబాద్: కరోనా పేషెంట్ అంటే దగ్గరకు వెళ్లడానికే భయపడతాం.. కానీ ఆ భార్యాభర్తలిద్దరూ కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్‌లో ఉన్న వారినే టార్గెట్ చేసి దొంగతనాలకు దిగారు. హాస్పిటల్‌లో ఔట్‌ సోర్సింగ్ స్టాఫ్‌గా చేరి, పేషెంట్ల బంగారు నగలు, సెల్‌ ఫోన్లు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. వాటిని అమ్ముకోవడం, తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్‌లో ఈ దొంగ పనులు చేస్తున్న  దంపతులు చింతపల్లి రాజు, చింతపల్లి లతశ్రీని  మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.  వీళ్లు చేసిన పనులకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ ఇద్దరి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశామని చెప్పారు. ఇంకా చాలా మొత్తం బంగారం, ఫోన్లు అమ్మి, తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును జల్సాలకు వాడారని, దానిని రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు.
భార్య కాపలా.. భర్త దోపిడీ..
‘‘గత రెండు నెలల నుంచి గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్‌లో కరోనా రోజుల బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగతనాలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చనిపోయిన వారి దగ్గర, సీరియస్ కండిషన్‌లో ఉన్న వాళ్ల దగ్గర విలువైన వస్తువులు మిస్ అవుతున్నాయని బంధువుల నుంచి కంప్లైంట్స్ అందాయి. వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో మాకు హాస్పిటల్‌లో పని చేసేవాళ్ల మీద డౌట్ వచ్చింది. ఆ దిశగా ఎంక్వైరీ మొదలు పెట్టాం. చోరీ ఒక సెల్‌ ఫోన్‌ను ట్రేసింగ్ ద్వారా గుర్తించడంతో కేసు సాల్వ్ చేయడం ఈజీ అయింది. చింతపల్లి రాజు, చింతపల్లి లత శ్రీ.. ఇద్దరు దంపతులను అరెస్టు చేశాం. వీరిద్దరిదీ రెండో పెళ్లి. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని ఓలాలో తిప్పేవాళ్లు. ఆ డబ్బు సరిపోవడం లేదని ఇలా టిమ్స్‌లో ఔట్‌ సోర్సింగ్ స్టాఫ్‌గా చేరి దొంగతనాలు మొదలు పెట్టారు. ఏప్రిల్ 17న మొదట సెల్ ఫోన్ దొంగతనం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న వారి, చనిపోయిన వారిని టార్గెట్ చేసి, భార్య కాపలా కాస్తుంటే భర్త దొంగతనం చేసేవాడు. అరెస్టు చేసే సమయంలో వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. 3 తులాల పుస్తెలు, ఒక తులం గోల్డ్ చైన్, 2 తులాల గోల్డ్ పుస్తెల తాడు, 4 తులాల గోల్డ్ పుస్తెల తాడు, 2 తులాల గోల్డ్ కమ్మలు, మాటీలు.. ఒక  జత కాళ్ల కాడాలు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేశాం. ఈ ఇద్దరిపై ఏడు కేసులు పెట్టాం. పీడీ యాక్ట్ కూడా పెడతాం. దొంగిలించిన చాలా ఆభరణాలను నగల దుకాణాల్లో అమ్మి, వచ్చిన డబ్బును ఖర్చు పెట్టేశారు. ఇంకా ముతూత్ ఫైనాన్స్, అట్టిక ఫైనాన్స్ లో కూడా కొన్ని నగలు కుదపెట్టినట్టు మా దర్యాప్తు లో తేలింది. వాటిని రికవరీ చేయాల్సి ఉంది” అని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.