టమోటా వాహనం కర్నాటకలో హైజాక్... చెన్నై మార్కెట్ లో అమ్మకం

టమోటా వాహనం  కర్నాటకలో హైజాక్... చెన్నై మార్కెట్ లో అమ్మకం

కర్నాటకలో రైతును బెదిరించి 2 వేల కిలోల టమాటా ట్రక్కును దోచుకెళ్లిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. అరెస్టయిన నిందితులను భాస్కర్, అతని భార్య సింధూజగా గుర్తించారు.

అసలు ఏం జరిగిందీ..?

ఈ మొత్తం వ్యవహారం బెంగళూరులోని చిక్కజాల సమీపంలోని RMC యార్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. జులై 8న  రైతు కోలార్ మార్కెట్‌కు 3 లక్షల రూపాయిల విలువైన  టమాటాలు తీసుకెళ్తుండగా దుండగుల  ముఠా వాహనాన్ని వెంబడించారు. అగంతకులు ముందుగా వాహనాన్ని ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. రైతును బెదిరించిన దుండగులు అతడిని బయటకు నెట్టివేసి టమాటా లారీతో పరారయ్యారు. నిందితులు చెన్నై వెళ్లి టమోటాలను విక్రయించారు.

 నిందితుల కోసం గాలింపు

ఈ మొత్తం ఘటనపై రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. టమాటా నింపిన బొలెరోను నిందితుడు ఖదీం దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఎక్కడ కూర్చొని ప్లాన్ చేసి చెన్నై మార్కెట్ లో టమాటా అమ్మాడు. అనంతరం ఖాళీ వాహనంతో తిరిగి వచ్చి పారిపోయాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఆర్‌ఎంసి యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఘటనలో చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. 

రాకీ, కుమార్, మహేష్ అనే ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో  దుండగులు  రైతు నుండి డబ్బు డిమాండ్ చేయడంతో రైతు భయపడి .. ఆన్‌లైన్ మొబైల్ ఫోన్‌లో డబ్బును కూడా బదిలీ చేశాడని పోలీసులు తెలిపారు. రుతుపవనాలు, ఇతర వాతావరణ సంబంధిత కారణాల వల్ల  టమోటాలు చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి.