
ముంబై నగరంలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఘట్‌కోపర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో భార్యాభర్తల మృతదేహాలు లభించడం సంచలనం సృష్టించింది.
దీపక్ షా, రినా షా ఉండే ఫ్లాట్లో పనిచేసేందుకు బుధవారం పని మనిషి వెళ్లింది. కాలింగ్ బెల్ నొక్కితే అవతలి నుంచి స్పందన రాలేదు. చాలా సేపు ప్రయత్నించినా కూడా ఎవరు డోర్ తెరవలేదు. దీంతో కంగారు పడ్డ పనిమనిషి.. దీపక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. హుటాహుటీన ఫ్లాట్ దగ్గరకు వచ్చిన ఆమె..మరో కీతో తలుపులు తెరిచింది. అదే సమయంలో బాత్‌రూమ్ నుంచి షవర్ శబ్దం వినిపించింది. దీంతో బాత్‌రూమ్ తలుపు తెరిచి చూడగా...దీపక్ షా, రినా షా ఇద్దరూ దుస్తులు లేకుండా విగతజీవులుగా పడిఉన్నారు.వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా..వారిద్దరు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
దీపక్ షా, రినా షా మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని..ఇద్దరి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాత్‌రూమ్‌లోని గీజర్ షాక్ కొట్టడం వల్లే ఇద్దరు చనిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసినా..ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదు. అయితే ఇద్దరి పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.