
భారీ వరదలకు కేరళలోని ఆ ఊరూ చెరువైంది. చుట్టూ నీళ్లు.. కన్నీళ్లు.. అయినా వారిద్దరూ నిరుత్సాహపడలేదు. కష్టంలోనూ ఇష్టంగా ముందుకు కదిలారు. మేళతాళాలు లేవు.. ముత్తయిదువులు లేరు.. తోడుగా ముగ్గురు రాగా.. వంటలు చేసేందుకు తెచ్చుకున్న పెద్ద పాత్రను నీటిపై బోటులా వాడుకుని.. అందులో కూర్చుని వెళ్లారు. గుడి పక్కనే ఉన్న ఫంక్షన్ హాలుకు చేరుకుని.. కొద్ది మంది బంధువుల మధ్య.. వరద నీటి సాక్షిగా వివాహం చేసుకున్నారు. అలప్పుజ జిల్లాలోని తలవాడీలో సోమవారం జరిగిందీ పెండ్లి. వధూవరులు ఐశ్వర్య, ఆకాశ్.. ఇద్దరూ స్థానిక చెంగన్నూర్‌లోని ఓ హాస్పిటల్‌లో హెల్త్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వారిది కులాంతర వివాహం కావడంతో అమ్మాయి తరఫు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెల 5నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలవాడీలోని ఓ గుడి దగ్గర పెండ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వాన వచ్చినా.. వరద ముంచెత్తినా.. అనుకున్న రోజున ఒక్కటయ్యారు.