కరీంనగర్​ గ్రీవెన్స్ సెల్లో  కలెక్టర్​కు దంపతుల సూసైడ్ నోట్

కరీంనగర్​ గ్రీవెన్స్ సెల్లో  కలెక్టర్​కు దంపతుల సూసైడ్ నోట్

కరీంనగర్ : తమకు గతంలో టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణ పర్మిషన్ వచ్చినా కొందరు అడ్డుకుంటున్నారని, తిరిగి అనుమతి ఇప్పించాలని, లేదంటే గవర్నర్ కు ఫిర్యాదు చేసి అక్కడే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ కొత్త రాజిరెడ్డి, ఆయన భార్య సుజాత కరీంనగర్ కలెక్టర్ కు సోమవారం సూసైడ్ నోట్ ఇచ్చారు. కరీంనగర్ లోని భగత్ నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ కొత్త రాజిరెడ్డి కరీంనగర్ లో ఉన్న తన పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం టీఎస్ బీపాస్ ద్వారా పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2021 జూలై 27న అనుమతి వచ్చింది. కానీ చీటి రామారావు అనే వ్యక్తి రెండేండ్లుగా నిర్మాణాన్ని  అడ్డుకుంటున్నాడని, ఆయనకు పోలీసులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సర్వే ల్యాండ్​ రికార్డ్స్ ఏడీ మద్దతు ఇస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారని రాజిరెడ్డి ఆరోపించారు.  920/4 సర్వే నంబర్ లో తన ప్లాట్ నంబర్ 10 అని, తనకు బౌండరీగా 9, 11 నంబర్ ప్లాట్లు ఉన్నాయన్నారు. రామారావు డాక్యుమెంట్ లో ఎలాంటి ప్లాట్ నంబర్ గానీ, బౌండరీ గానీ లేదన్నారు. ల్యాండ్ అమ్మాలని కొన్నేళ్లుగా స్థానిక కార్పొరేటర్ తనను బెదిరిస్తున్నాడని, వినకపోవడంతో చీటి రామారావుకు 2018లో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించి తనపైకి ఉసిగొల్పాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే  గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​కు ఫిర్యాదు చేసి అక్కడే కుటుంబంతో సహా సూసైడ్​ చేసుకుంటానని హెచ్చరించాడు. 

పరిహారం ఇస్తలేరని.. 

భూపాల్ పల్లి రూరల్ : బొగ్గు గనుల్లో భూములు కోల్పోయిన రైతుకు పరిహారం ఇవ్వకపోవడంతో గ్రీవెన్స్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ఆవరణలో సోమవారం జరిగింది. గణపురం మండలం పరశురాంపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్యకు ఎకరంన్నర భూమి ఉంది. 2019లో కేటీకే ఓసీపీ–3 గని ఏర్పాటులో భూమిని కోల్పోయాడు. అప్పుడే పొలంలోని 78 టేకు చెట్లు కూడా పోయాయి. ఓసీపీ ఏర్పాటు టైంలో ఎకరం భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగిలిన  వాటికి ఇవ్వకపోవడంతో తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. దీంతో సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి వచ్చి లోపలకు వెళ్లక ముందే పురుగుల మందు తాగాడు.  గమనించిన అక్కడి ఉద్యోగులు వంద పడకల హాస్పిటల్ కి  అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకి తీసుకువెళ్లారు.  ఈ విషయమై కలెక్టర్​ భవేశ్​ మిశ్రా మాట్లాడుతూ సాంబయ్య సమస్యపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.