
- పెటీ కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్ల చేతివాటం
- ఫైన్‌కు మించి నిందితుల నుంచి వసూలు
- వందల్లో ఫైను ఉంటే.. వేలల్లో తీసుకుంటున్నరు
- 3 కమిషనరేట్లలో ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు
హైదరాబాద్,వెలుగు: ఈ–పెటీ కేసులు కోర్టు కానిస్టేబుళ్లకు జేబులు నింపుతున్నాయి. కోర్టుకు హాజరయ్యే నిందితుల వద్ద కొందరు కోర్ట్ కానిస్టేబుళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సెక్షన్స్ ప్రకారం జడ్జి విధించే ఫైన్ల కంటే కానిస్టేబుళ్లు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ– పెటీ కేసుల్లో నిందితులకు కోర్టు విధించే ఫైన్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించుకుని అవాక్కైతున్నారు. ఇలాంటి ఘటనలు గ్రేటర్ సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పెరిగిపోతున్నాయి.
కేసు నమోదు ఇలా..
పబ్లిక్ ప్లేసెస్‌లో పార్టీల పేరుతో డీజే సౌండ్స్, మద్యం తాగడం, స్మోకింగ్, న్యూసెన్స్ చేయడం వంటివి చేస్తే.. పోలీసులు పెటీ కేసులు నమోదు చేస్తుంటారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు విడివిడిగా కేసులు రిజిస్టర్ చేస్తారు. న్యూసెన్స్ చేసే వారిని స్పాట్‌లోనే ఫొటో, వీడియో తీసుకుని టీఎస్ పోలీస్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. స్పాట్‌లో ఉన్న వారి ఫోన్ నంబర్స్ తీసుకుంటారు. ఫొటోస్, ఫోన్ నంబర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనే ఈ – పెటీ కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ వెంటనే చార్జిషీట్ ఫైల్ చేస్తుంటారు. వీటిని మార్నింగ్ కోర్ట్‌లో విచారణకు
పంపిస్తారు.
మార్నింగ్ కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు
పెట్రోలింగ్ పోలీసులు, బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఇలాంటి కేసులను రిజిస్టర్ చేస్తారు. ట్యాబ్‌ల సాయంతో వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి కేసులు నమోదు చేస్తారు. నిందితుల ఫోన్ నంబర్స్‌కి మెసేజ్ చేస్తుంటారు. హాజరు కావాల్సిన కోర్టు పేరు, కానిస్టేబుల్ వివరాలు అందిస్తారు. దీంతో ఈ– పెటీ కేసులో రెస్పాడెంట్స్ సంబంధిత కోర్టులకు ఉదయం10 గంటలలోపు విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ ప్రకారం జడ్జి ఫైన్లు, శిక్షలు విధిస్తారు. కోర్టు విధించిన ఫైన్ డబ్బును వెంటనే చెల్లించాలి. న్యూసెన్స్ కేసుల్లో సాధారంగా సెక్షన్స్‌ను బట్టి రూ.50 నుంచి 500 వరకు జరిమానాలు ఉంటాయి. వీటి కంటే కోర్టు కానిస్టేబుల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయి.
సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు యువకులు కొద్దిరోజుల సిటీకి వచ్చి పబ్లిక్ ప్లేస్‌లో బీర్లు తాగుతుండగా.. అదే సమయంలో బ్లూ కోల్ట్ పోలీసులు వచ్చి ఫొటోస్ తీసుకుని ఈ– పెటీ కేస్ రిజిస్టర్ చేశారు. మరుసటి రోజు మార్నింగ్ కోర్టులో హాజరుకావాలని మెసేజ్ రావడంతో నలుగురు కోర్టుకు వెళ్లారు. తమకు వచ్చి మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబర్‌తో కోర్టు కానిస్టేబుల్‌ను కలిశారు. రూ.4 వేలు ఇచ్చి వెళ్లిపోండి.. అంతా నేను చూసుకుంటానని కానిస్టేబుల్ చెప్పగా.. ఓ లాయర్‌ను కలిశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పెటీ కేస్ సెక్షన్ ప్రకారం కోర్టు విధించే ఫైన్రూ.50 మాత్రమే అని తెలుసుకుని ఆ నలుగురు అవాక్కయ్యారు.
సంతోష్‌నగర్‌కు చెందిన మహేశ్ షాపింగ్ కోసం వచ్చి రోడ్డు పక్కన కార్ పార్క్ చేశాడు. స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఈ– పెటీ కేసు రిజిస్టర్ చేశారు. తనకు వచ్చిన మెసేజ్‌లో ఉన్న నంబర్‌కి మహేశ్ కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడు. దీంతో రూ.200 ఫైన్ ఉన్న ఆ కేసులో ఆ కానిస్టేబుల్ రూ. వెయ్యి తీసుకున్నాడు. కోర్టుకు హాజరుకాకపోయినా కేస్ క్లోజ్ చేయించాడు.’’ ఇలా.. పెటీ కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్లు గూగుల్ పే, ఫోన్ పే కాకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటుండడం గమనార్హం.