నిర్మల్ అడిషనల్ కలెక్టర్ వాహనం సీజ్​కు కోర్టు ఆదేశాలు

నిర్మల్ అడిషనల్ కలెక్టర్ వాహనం సీజ్​కు కోర్టు ఆదేశాలు
  • రైతులకు పరిహారం ఇవ్వకపోవడంపై నిర్మల్​ కోర్టు ఆగ్రహం 

నిర్మల్, వెలుగు:  శ్రీరాంసాగర్  ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపు విషయంలో జరుగుతున్న అలసత్వంపై నిర్మల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో మంగళవారం అడిషనల్​కలెక్టర్​ రాంబాబు వాహనాన్ని కోర్టు అధికారులు జప్తు చేశారు. 

నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం బామ్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ముంపు భూముల పరిహారం కోసం కొన్నేండ్లుగా సీనియర్​సివిల్​ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో  రైతులకు పరిహారం కింద రూ.21 లక్షలు చెల్లించాలని గతంలో  కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా స్పందించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాల్సిందిగా జడ్జి అజేశ్​కుమార్ ​ఉత్తర్వులిచ్చారు.