బాలికను మోసం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష

బాలికను మోసం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష

జైనూర్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను మోసం చేసిన యువకుడికి పదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని వంజరిగుడాకు చెందిన కేంద్రెచంద్రకాంత్ (మేస్త్రి) మహారాష్ట్ర నుంచి వచ్చి గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళ కూతురిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు. 

దీంతో బాలిక తల్లి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై తిరుపతి కేసు ఫైల్ చేశారు. మైనర్​ను ప్రేమ, పెండ్లి పేరిట నమ్మించి గర్భవతిని చేసిన చంద్రకాంత్​పై పోస్కో కేసు నమోదు చేశారు. కేసులో సాక్షులను గురువారం ఆసిఫాబాద్​లోని ప్రిన్సిపాల్ అండ్ సెషన్స్​ కోర్టులో హాజరు పరుచగా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు చంద్రకాంత్​కు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత డీఎస్పీ చిత్తరంజన్ , జైనూర్ సీఐ రమేశ్, లింగాపూర్ ఎస్సై గంగన్న, పోలీస్ సిబ్బందిని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు.