కవర్ స్టోరీ..ఆహా.. మన రుచి! : మామిడి హరికృష్ణ

కవర్ స్టోరీ..ఆహా.. మన రుచి! : మామిడి హరికృష్ణ

 ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్న ఫుడ్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాయి. ఇలాంటివే ఈ ఏడాదికి ప్రపంచంలో బెస్ట్​ ఫుడ్స్​ అందిస్తున్న దేశాల్లో మన దేశాన్ని 11వ స్థానంలో నిలిపాయి. 

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం” అన్నారు రాయప్రోలు సుబ్బారావు. 

ఇప్పుడు భారతీయులే కాదు.. మన వంటకాలు కూడా మన జాతి గౌరవాన్ని పెంచుతున్నాయి. ఇండియాలో పుట్టి ప్రపంచమంతా ఆదరణ పొందుతున్నాయి. నేటి ప్రపంచంలో ఇండియన్ వంటకాలు ప్రపంచ వంటకాలపై చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని ప్రాంతీయ, సంప్రదాయ వంటకాలు విదేశాల్లో ఫేమస్‌‌‌‌ అవుతున్నాయి. మన ఫుడ్‌‌‌‌.. నేల రకం, వాతావరణం, సంస్కృతి, వృత్తుల వల్ల చాలా వైవిధ్యంగా ఉంటుంది. 

ఇండియాలో దొరికే సుగంధ ద్రవ్యాలు, మూలికలు, కూరగాయలు, పండ్ల ఆధారంగా ప్రతి వంటకం భిన్నంగా ఉంటుంది. అందుకే కాలక్రమేణా భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, మారిషస్, కరేబియన్‌‌‌‌ దీవుల్లో ఫేమస్‌‌‌‌ అయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ఇండియన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ దొరుకుతుంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్‌‌‌‌ బిర్యానీ వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెప్తోంది. సౌదీ, సౌత్ ఆఫ్రికాల్లో వడాపావ్ నోరూరిస్తోంది. 
 

‘టేస్ట్‌‌‌‌ అట్లాస్‌‌‌‌’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులపై ప్రతి సంవత్సరం రీసెర్చ్​ చేస్తుంది. క్రొయేషియా దేశంలో స్థాపించిన ఈ సంస్థ  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌, రీసెర్చ్‌‌‌‌ల ఆధారంగా ఆయా దేశాల ఫుడ్స్‌‌‌‌కి ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. అలా2023వ సంవత్సరానికి కూడా ఒక లిస్ట్​ను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అత్యుత్తమ వంద వంటలు అందిస్తున్న దేశాల్లో మన దేశం11వ స్థానంలో నిలిచింది.  

ఇటాలియన్, జపనీస్, గ్రీక్ వంటకాలు వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా ప్రపంచంలోని10 ఉత్తమ వంటల్లో భారతీయ ‘ఫిర్ నీ’ 7వ స్థానం, ‘ఖీర్’ 10వ స్థానం, 50 ఉత్తమ మిఠాయిల్లో ‘రస్ మలాయ్’ 31వ స్థానం, ‘కాజు కత్లీ’ 41వ స్థానంలో నిలిచాయి. దాంతో ఆహారం, భారతీయ వంటలు, తెలంగాణ రుచుల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. 

ఆహారమే సంస్కృతి

అవును... ‘‘Food is Culture’’!... ఇదే పేరుతో 2006లో పుస్తకాన్ని రాసిన మస్సిమో మోంటనారి  ఆహారానికి.. సంస్కృతికి, ఆహార సంస్కృతికి మధ్య ఉన్న రిలేషన్​ గురించి లోతుగా రీసెర్చి చేసి ‘సంస్కృతి అంటేనే ఆహారం’ అన్నాడు. ప్రపంచంలోని అన్ని భాషల్లో ‘‘సంస్కృతి” అనే పదానికి ఉన్నంత విస్తృతమైన అర్థం, విశాల దృక్పథం బహుశా మరే పదానికి లేదు కాబోలు! ఒక దేశ, జాతి, సమాజ సంస్కృతిని నిర్ధారించే అంశాల్లో కొట్టొచ్చే విధంగా కనిపించే అంశాలు వస్త్రధారణ, వేషధారణ, భాషతోపాటు ఆహారపు అలవాట్లు​, ఆహార తయారీ వంటివి ఉంటాయి. 

ఆదిమానవుని కాలం నుంచి ఆహారపు అలవాట్లు అతని శారీరక, మానసిక అవసరానికి అనుకూలంగా ఉంటున్న విషయాల్ని పరిణామ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనికితోడు భూగోళంపైన ఉండే ఆయా భౌగోళిక, శీతోష్ణస్థితి లాంటి వాటిని బట్టి ఆయా ప్రాంతాల్లో నివసించే వాళ్లకు ఆహారపు అలవాట్లు వస్తాయని చెప్పారు.

పరిస్థితులు, ప్రాంతాలను బట్టి...

మనిషి శరీరంలోని పళ్లు, జీర్ణ, కండర, అస్థి పంజర, రక్త ప్రసరణ వ్యవస్థలు, చేతులు, పాదాలు డెవలప్​ అవడం వెనక ఆహారానిది ప్రధాన భూమిక. ఆది మానవుడు నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ల జీవిగా మారే క్రమంలో అందుకు తగ్గట్టు ఆహారపు అలవాట్లు, శరీరంలోపల జీవక్రియ వ్యవస్థలన్నీ ఏర్పడ్డాయని ఫిజియాలజిస్టులు చెప్తారు. ఫిజియాలజీ నుంచి జియాలజీకి వస్తే... భూమధ్య రేఖ ప్రాంతంలో, కర్కాటక–మకర రేఖలకు అవతలివైపు ఉన్న ప్రాంతంలో ధృవ మండలాల్లోని శీతల ప్రాంతాల్లో ఉన్న మనుషులు అక్కడి చల్లటి వాతావరణ పరిస్థితులకు  తగిన ఆహారపు అలవాట్లు చేసుకున్నారు. 

ముఖ్యంగా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే వాళ్లు ఎండ తీవ్రతని తట్టుకోగలిగేలా శరీరాన్ని, శరీరంలోని జీవక్రియ వ్యవస్థలను చల్లపరిచే ఫుడ్​ తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే మంచు ప్రాంతాల్లో ఉండే వాళ్లు శరీరంలో ఉష్ణోగ్రతని పెంచే ఫుడ్​తినడం మొదలుపెట్టారు. 

సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉండే వాళ్లు అక్కడి పరిస్థితులకి తగిన ఆహారాన్ని తిన్నారు. అందుకే ‘‘ప్రపంచ మానవ నాగరికత ప్రస్థానం అంతా ఆహార ప్రస్థానమే” అని కొందరు చెప్తారు. మానవ పరిణామ క్రమాన్ని పర్యావరణ, భౌగోళిక, నైసర్గికంగా చూస్తే...  ఆయా కాలాల్లో, ప్రాంతాల్లో, దేశాల్లోని ఆహారపు అలవాట్లు కూడా ఎంత కీలకంగా ఉన్నాయో అర్థమవుతుంది.

 ఆ అలవాట్లే ప్రధానం

మానవ జీవన ప్రవాహంలో 13వ శతాబ్దం వరకు ఉన్న జీవన విధానం అంతా ఒకలా ఉంటే 14, 15 శతాబ్దాల కాలంలో ఏర్పడిన భౌగోళిక పరిశోధనలు, కొత్త ఖండాల ఆవిష్కరణల ద్వారా కొత్త ప్రదేశాల అన్వేషణలు వంటివి గొప్ప మలుపు తిప్పాయని చెప్పొచ్చు. అలాగే 15వ శతాబ్దంలో సంభవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం కళాత్మక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అలాగే ఆహారపు అలవాట్లలో ఒక గొప్ప మలుపు తెచ్చింది. 

16వ శతాబ్దంలో యూరప్‌‌‌‌లో సంభవించిన శాస్త్రీయ విప్లవం, 17వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంగా దారితీసి టెక్నాలజీకి బలమైన పునాదులను ఏర్పరిచింది.19వ శతాబ్దంలో మొదలైన మోడర్న్​ టెక్నాలజీ ప్రగతి ఫలాలను మానవాళికి అందించి, 21వ శతాబ్దపు మొదలు నాటికి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది. సమాచార విప్లవం, ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ పరంగా సంభవించిన పరిణామాలు, ఇంటర్నెట్‌‌‌‌, సోషల్​ మీడియా ఒక కొత్త ప్రపంచాన్ని మనముందు ఆవిష్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దేశాలు, ప్రాంతాలు, జాతులు తమ ప్రత్యేకతని వారి అస్తిత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతున్న అంశాల్లో ఆహారపు అలవాట్లు ప్రధానంగా ఉన్నాయి.

సుగంధ ద్రవ్యాలతో...

చరిత్రలోకి తొంగిచూస్తే మానవజాతి పరిణామాన్ని ప్రభావితం చేసి, మలుపు తిప్పిన అంశాలన్నింటికీ ఆహారం, ఆహార సంబంధిత అంశాలు ప్రధాన కారణంగా నిలవడం ఆశ్చర్యమే! అయినప్పటికీ అవి నిజాలు కాకుండా పోవు.14వ శతాబ్దం నాటి పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఆనాటి ప్రపంచానికి భూమి పరంగా తెలిసిన ఖండాలు యూరప్‌‌‌‌, ఆసియాలు మాత్రమే! యూరప్‌‌‌‌కి ఆసియా దేశాల మధ్య భూమార్గం ద్వారా వర్తక, వ్యాపారాలు, వాణిజ్య వ్యవహారాలు జరుగుతుండేవి. 

ఒక దేశానికి సంబంధించిన చక్రవర్తులు తమ భూభాగాలను కాపాడుకోవడం, దానికి తగ్గట్టుగా రథ, గజ, తుర, పదాతి దళాలను, అశ్విక దళాలను సమకూర్చుకోవడం ఆయా దేశాల బలానికి చిహ్నంగా ఉండేది. దానికి తోడు ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశంలో పండే సుగంధ ద్రవ్యాలతో  యూరప్‌‌‌‌లో వ్యాపారాన్ని చేస్తూ ఉండేవి. యూరప్‌‌‌‌ ప్రాంతంలోని భౌగోళిక నైసర్గిక పరిస్థితులు లవంగాలు, సాజీర, దాల్చిన చెక్క, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలను పండించడానికి అనువుగా ఉండేవి కావు. 

ఇలాంటి మసాలా ద్రవ్యాలకు అనువైన నేల ఉన్నది భారతదేశంలోనే. స్పెయిన్‌‌‌‌, ఇటలీ, ఫ్రాన్స్‌‌‌‌, పోర్చుగల్‌‌‌‌ లాంటి దేశాలకు చెందిన వ్యాపారులు భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలను భూమార్గం ద్వారా తీసుకెళ్లి తమ దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందేవాళ్లు. ఇలా యూరప్‌‌‌‌, భారతదేశానికి మధ్య వ్యాపార వాణిజ్య వ్యవహారాలు1453 వరకు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగాయి. కానీ 1453లో యూరప్‌‌‌‌, ఆసియాలకు మధ్య వారధిగా ఉండే కాన్‌‌‌‌స్టాంటినోపుల్‌‌‌‌ నగరాన్ని ఆటోమాన్‌‌‌‌ తురుష్కులు గెలుచుకున్నారు. ఆ తరువాత వాళ్లు నగరాన్ని దిగ్బంధనం చేసి యూరప్‌‌‌‌, ఆసియాల మధ్య రాకపోకలను నియంత్రించారు. దాంతో భారతదేశంలో మాత్రమే పండే సుగంధ ద్రవ్యాల ఎగుమతులు యూరప్‌‌‌‌కు నిలిచిపోయాయి. దానివల్ల యూరప్‌‌‌‌లోని వ్యాపారులు నష్టపోవాల్సి వచ్చింది.

సముద్ర మార్గం

ఒకవైపు యూరప్‌‌‌‌ ప్రజల డిమాండ్‌‌‌‌, మరొకవైపు సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లలేని పరిస్థితి! దీనివల్ల స్పెయిన్‌‌‌‌, పోర్చుగల్‌‌‌‌, హాలండ్‌‌‌‌, ఇటలీ, ఇంగ్లాండ్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌ దేశాలకు చెందిన వ్యాపారులు అక్కడి చక్రవర్తులను అభ్యర్థించి, ఒత్తిడి చేసి భారతదేశానికి వెళ్ళడానికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుక్కోవడం కోసం సముద్ర మార్గాన్ని కనుక్కోమని రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితంగానే కొలంబస్‌‌‌‌ (1492లో), వాస్కోడిగామా (1498), అమెరిగో వెస్పూసి, జాన్‌‌‌‌ కాబట్‌‌‌‌, బార్తలో మ్యూ డియాస్‌‌‌‌, మాజిలాన్‌‌‌‌ వంటి నావికులు భారతదేశానికి యూరప్‌‌‌‌ నుంచి సముద్ర మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం మొదలెట్టారు. దాని ఫలితంగానే అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలు తెలిసి వచ్చాయి. అవి.. 
 
    ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం కొత్తగా వెలుగులోకి రావడం.
    భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం నిరూపించడం. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా భూమిని చుట్టి వచ్చిన మొదటి మానవుడిగా మాజిలాన్‌‌‌‌ రికార్డు సృష్టించడం. 
     యూరప్‌‌‌‌ దేశాల వలస వాదానికి  కొత్త ఖండాల్లో యూరప్‌‌‌‌ దేశాల ఆధిపత్యానికి దారితీశాయి.

కొత్త ప్రపంచం వెలుగులోకి...

ఇలా ప్రపంచ గమనాన్నే మార్చిన కీలక పరిణామాలకు భారతదేశంలోని సుగంధ ద్రవ్యాల ఆవశ్యకత యూరప్​ ప్రజలకు ఉండటమే ప్రధాన కారణమైంది. ఆహారానికి సంబంధించిన పంటలు వాళ్లకు అందుబాటులో లేకపోవడం వల్ల, ఆహారపు అలవాట్ల కొనసాగింపుకు చేసిన ప్రయత్నాల వల్ల భూగోళంపైన అప్పటివరకూ తెలియని ఒక నూతన ప్రపంచం వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి ఆహారం, ఆహార వస్తువులు మనుషుల పరిణామ క్రమంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. 

అంతేగాక ప్రతి దేశానికి సంబంధించిన ఆహారం, దాని తయారీ విధానం, వాటిలోని పోషక విలువలు  అన్నీ ఆయా దేశాల ప్రత్యేక గుర్తింపుగా, ఒక సాంస్కృతిక అస్తిత్వ పతాకగా నిలవడం గుర్తించాల్సిన విషయం. అందుకే సంస్కృతిలో ఆహారం అంతర్భాగంగా ఉంటూ, ఒక దేశానికి గుర్తింపునిచ్చే కీలక కారకాలలో ఒకటి అయింది. దీనినే సామాజిక మానవ శాస్త్రవేత్తలు ‘‘మీ ఆహారాన్ని చెప్పండి... మీ గురించి చెప్తాం” అంటారు. అలా ఒక దేశ జాతీయత, ఆహారం రెండూ కలిసిపోయి ఆ దేశ వ్యక్తిత్వ వికాస సూచికలుగా గుర్తిస్తారు. ప్రపంచం మొత్తం మీద ఉండే వైవిధ్యత, విభిన్నత అంతా ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్ల ఆధారంగా నిర్ధారించే స్థితికి చేరుకుంది.

తిండిని బట్టి వ్యక్తిత్వం

ఒక దేశ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, ఆ దేశ అతిథ్యం ఈ మూడు అంశాల్లో సామాజిక, మానసిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. దీన్నే మరో విధంగా ‘‘నువ్వేం తింటావో... అదే నువ్వు” అని చెప్పొచ్చు. అంటే ఆహారపు అలవాట్లు భోజనం చేసే తీరు, ఆహార ఎంపికను బట్టి మన వ్యక్తిత్వాన్ని, అభిరుచులని చెప్పొచ్చన్నమాట! ఒక ప్రాంతంలో లేదా దేశంలో నివసిస్తున్న ప్రజలు ఒకేలాంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. వారి వారి సంస్కృతులు ఆమోదించిన ఆహారాన్ని తింటూ ప్రజలు ఎదుగుతారు. దీనినే ఇవాన్‌‌‌‌ పావ్లోవ్‌‌‌‌ అనే శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు, మనోవైజ్ఞానిక వేత్త, నోబెల్‌‌‌‌ పురస్కార గ్రహీత  ‘‘నిబంధన సిద్ధాంతం’’ అని వివరించారు.
 

ఆదిమ మానవుడు మనుగడ కోసం చేసే పోరాటంలో అన్ని రకాల ఆహారాలను తిన్నాడు. కానీ.. కాలక్రమంలో కొన్ని ఆహారాలకే పరిమితం కావడం వెనక ఆయా దేశాలు, జాతుల సంస్కృతి, విశ్వాసాలు, నమ్మకాలు, అలవాట్లు ప్రధాన ప్రభావాన్ని చూపించాయి. తూర్పు ఆసియా దేశాలకు చెందిన ప్రజల ఆహారపు అలవాట్లు ఆసియా ఖండంలోనే ఇతర ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లకంటే భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇదే పరిస్థితి ప్రపంచమంతా ఇటాలియన్‌‌‌‌, స్పానిష్‌‌‌‌, మెక్సికన్‌‌‌‌, అమెరికన్‌‌‌‌, ఆఫ్రికన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌లుగా కనిపిస్తుంది.

ట్రెడిషనల్​ ఫుడ్​

ఇక వందలాది సంవత్సరాలుగా ఒక జాతి ప్రజలు తరతరాలుగా ఆచరిస్తున్న ఆహారపు అలవాట్లలో నుంచి పుట్టిన రీతినే ‘సంప్రదాయ ఆహారం’ అని చెప్పొచ్చు. ఒక జాతిలో వారసత్వంగా ఉండే భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ, వస్త్రాలంకరణతో పాటు ఆహారం కూడా తనదైన ప్రత్యేకతతో, ప్రత్యేక వంట విధానంతో ఆ జాతికి సూచికగా నిలుస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక దేశానికి సంబంధించిన ఆహారం ఆ జాతి ప్రజల జాతీయతకి గర్వకారణం. 

ఆ ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఆ దేశ చరిత్రను, జీవనశైలిని, విలువలను, నమ్మకాలను కూడా తెలియజేస్తాయి. అయితే, కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగ, వ్యాపార–వాణిజ్య, పర్యాటక అవసరాల కోసం వలస వెళుతున్న క్రమంలో... భాష, సంస్కృతితోపాటు వాళ్ల వంటలు, భోజన విధానం, ఆహారపు అలవాట్లు, ఆహార తయారీ ప్రక్రియలు అన్నింటినీ తీసుకెళ్తున్నారు. దీనివల్ల, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం వలసలు మరింత పెరిగి వివిధ దేశాలకు సంబంధించిన ఆహారాలు మరొక దేశానికి పరిచయం అయ్యాయి. 

17, 18వ శతాబ్దంలో బ్రిటిష్‌‌‌‌, ఫ్రెంచ్‌‌‌‌ ఇతర యూరప్‌‌‌‌ దేశాల వలసల వల్ల వెస్టర్న్​ దేశాలకు సంబంధించిన ఆహారం, ఆహార తయారీ విధానాలు భారతీయ జనజీవనంలోకి చొచ్చుకు వచ్చాయి. అంతకు పూర్వం ఢిల్లీ సుల్తాన్‌‌‌‌లు (1296–1526) మొఘలాయీ పాలనల (1526–1857) వల్ల పర్షియా, అరేబియా, అఫ్గానిస్తాన్‌‌‌‌, ఇరాన్‌‌‌‌, మధ్యప్రాచ్యం లాంటి దేశాలకు సంబంధించిన ఆహార విధానాలు, వంట విధానాలు, ప్రక్రియలు భారతదేశంలో అంతర్భాగంగా మారిపోయాయి. మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన ఇరానీ చాయ్‌‌‌‌, బిర్యానీ, బిస్కెట్లు, మాంసాహార వంటకాలు వంటివి భారతదేశంలోకి ముస్లిం పరిపాలకులతోపాటు ఎలాగైతే వచ్చాయో... అలాగే బ్రిటన్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌, పోర్చుగల్‌‌‌‌ పాలకులతోపాటు శాండ్విచ్‌‌‌‌, బ్రెడ్‌‌‌‌, బిస్కెట్‌‌‌‌, కేక్‌‌‌‌, ఇతర వంటకాలు, ఆహారాలు భారతదేశంలోకి వచ్చేశాయి.

వాతావరణానికి తగ్గట్టు​

ఇన్ని సాంస్కృతిక పరిణామాలు సంభవించినప్పటికీ భారతదేశంలో మూలవాసుల సంస్కృతి, స్థానిక సంస్కృతుల్లోంచి రూపొందిన ఆహారాలు, వంటలు అలాగే కొనసాగాయి. ఇవే భారతీయ సంప్రదాయ వంటలుగా ఆయా రాష్ట్రాల్లోని సాంస్కృతిక నేపథ్యాలను అనుసరించి ఇప్పటికీ భారతదేశంలోని వైవిధ్యతకు, విశిష్టతకు కొలమానాలుగా నిలుస్తున్నాయి. భారతీయ ఆహారంలో ముఖ్యంగా సంప్రదాయ ఆహార విధానంలో ప్రధానంగా వన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల వాడకం ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ భారత ఉపఖండంలోని విభిన్నమైన వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఆహార అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. 

భారతదేశంలోని హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌, కశ్మీర్​ల్లో మంచుకొండలు ఉండి చల్లగా ఉంటుంది అక్కడి వాతావరణం.  అదే రాజస్తాన్‌‌‌‌ ప్రాంతంలో అత్యంత వేడిగా ఉండే థార్‌‌‌‌ ఎడారి లాంటివి కనిపిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు, గుట్టలు, నదీ ప్రవాహాల లోయలతో మాసిన్‌‌‌‌ రాం, చిరపుంజి వంటి ప్రదేశాల్లో దాదాపు రోజూ వర్షాలు కురిస్తే, దక్షిణాదిలో దక్కన్‌‌‌‌ పీఠభూమి ప్రాంతంలో పర్వతాలు, సతత హరితారణ్యాలు, సమ శీతోష్ణ మండలాలు కనిపిస్తాయి. 

ఇలాంటి భౌగోళిక వైవిధ్యతను అనుసరించే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వంటకాలు తయారయ్యాయి. అయితే వీటన్నిటి అంతిమ లక్ష్యం -వాతావరణానికి తగిన శారీరక, మానసిక పరిస్థితిని అందించి ప్రజలను నిత్యం ఉత్సాహవంతులుగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే. అందుకే మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. ఆ లెక్కన ‘‘మంచి ఆహారం’’  అంటే వేలాది సంవత్సరాల కాలపరీక్షకు నిలిచి, గెలిచి కొనసాగుతున్న సంప్రదాయ ఆహార విధానం, సంప్రదాయ వంటలని మరోసారి రుజువైంది.

ఆహారమే ఔషధం!

‘‘ఆహారం మీ ఔషధంగా ఉండనివ్వండి. ఔషధం మీ ఆహారంగా ఉండనివ్వండి” అన్నాడు ప్రాచీన గ్రీక్​ ఫిజిషియన్​ హిప్పోక్రేట్స్​. ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించడం అంటే బాధ్యతగా ఏం తినాలి? ఎంత తినాలి? అని తెలిసి ఉండడం. ఇక్కడ 2020లో లక్షల మంది చావుకు కారణమైన కరోనా వైరస్‌‌‌‌ గురించి చెప్పుకోవాలి. హాస్పిటల్స్, ఆరోగ్య సదుపాయాలు ఎంతగానో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా క్షణాల్లో మరణించారు. 

తక్కువ జనాభా ఉన్న యూరప్‌‌‌‌, అమెరికా వంటి దేశాలు కూడా కరోనా ధాటిని తట్టుకోలేక చేతులెత్తేసాయి. భారతదేశంలాంటి అత్యంత జనసమ్మర్దం ఉన్న దేశంలో140 కోట్ల జనాభాలో కోట్లాది మంది మరణిస్తారని అంచనా వేశారు. కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే భారతదేశంలో కరోనా మరణాల నిష్పత్తి తక్కువగా నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. భారతదేశంలో కరోనా వైరస్‌‌‌‌ ఆందోళన పడినంతగా ప్రభావం చూపించకపోవడానికి కారణాలు ఏంటని స్టడీ చేస్తే...‘‘ఆ రహస్యం మన ఒంట్లోని రోగనిరోధక శక్తిలో ఉంది. 

దానికి కారణం వంటింట్లో, పోపుల పెట్టెలో ఉంద’’ని తెలిసింది. అంటే మన ఆహారపు అలవాట్లలో, ఆహార తయారీ విధానంలో వాడే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచాయి. దానివల్ల కరోనా బారినుంచి భారతీయులు తప్పించుకున్నారని తేలింది. అంటే మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా కూడా పనిచేస్తుందన్నమాట. 

ఆహారాన్ని ఔషధంగా వాడడాన్ని ఇటీవలికాలంలో ‘‘ఆహార చికిత్స’’ అంటున్నారు. అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన టి.వి. రియాలిటీ షో ‘‘The Biggest Loser: Couples 4’’ హోస్ట్‌‌‌‌ ప్రఖ్యాత  సెలబ్రిటీ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ట్రైనర్‌‌‌‌‌‌‌‌ ‘‘Brett Hoebel” ఆహార చికిత్సను సపోర్ట్​ చేస్తాడు. న్యూట్రిషన్‌‌‌‌ సైకాలజిస్ట్‌‌‌‌లు మనిషిలోని ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, జ్ఞాపక శక్తి లోపం వంటి మనోరుగ్మతల చికిత్సకు ఆహారమే ప్రాథమిక ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు.  బరువు తగ్గడానికి కూడా ఆహారం ఉపయోగపడుతుంది. అంటే ఆహారం కేవలం శారీరకపరమైన ఉత్తేజానికి, ఉత్సాహానికి మాత్రమే కాక, మానసికపరమైన ఉల్లాసానికి, ఉద్వేగాలను సమం చేసేందుకు  కూడా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఫుడ్​ ఇండస్ట్రీ..

ప్రస్తుతం భోజనం, వంటలు అనేవి పెద్ద ఇండస్ట్రీలా అయిపోయాయి. టూరిజం అనేది ఇప్పుడు మోడర్న్​ మోడల్​గా మారడం వల్ల ‘ఆహార రుచులు’ కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో వచ్చిన ‘సోషల్​ మీడియా రివల్యూషన్’  కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్ళింది. వంటలు, భోజనాలు, వంటల తయారీ వంటివి నేర్పించేందుకు గతంలో అమ్మలు, కుటుంబ సభ్యులే ఆధారంగా ఉండేది. 

1995లో టి.వి. ఛానెల్స్​ వచ్చాక న్యూస్‌‌‌‌, ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ఛానెల్స్‌‌‌‌లో వంటల తయారీకి ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. మరోవైపు వంటలు నేర్పించడానికి నగరాల్లో ప్రత్యేక విద్యాసంస్థలు, హోటల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోర్సులు, దేశ విదేశీ వంటల తయారీలో శిక్షణ కోసం ప్రత్యేకంగా ‘‘ఛెఫ్‌‌‌‌’’ కోర్సులు అకడెమిక్‌‌‌‌గా వచ్చేశాయి. అలాగే కాలనీలు, అపార్ట్‌‌‌‌మెంట్స్​లో స్వగృహ ఫుడ్స్‌‌‌‌ వంటి చిన్న స్థాయి కుటీర వ్యవస్థలు వంటల తయారీ చేస్తున్నాయి. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో యూట్యూబ్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ వేదికలుగా వర్చువల్‌‌‌‌ క్లాస్​లు తీసుకుని మరీ వంటలు నేర్పిస్తున్నారు. అంతేగాక, భారతీయ వంటలు, తెలుగు వారి వంటలు, తెలంగాణ వంటల గురించిన యూట్యూబ్‌‌‌‌ ఛానెల్స్​కు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంటోంది. ఈ జనరేషన్​ యువతకు వంటలు రాకపోవడం, ఉద్యోగ వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళాల్సి రావడం వంటి కారణాలవల్ల ‘గూగుల్‌‌‌‌’నే గురువుగా భావించి వంటలు చేస్తున్నారు!

తెలంగాణ రుచులు

తెలంగాణా చరిత్ర, సంస్కృతిలో ఆహారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బోనాలు, బతుకమ్మ వంటి పండుగల సందర్భంలో చేసేస్పెషల్​ పిండివంటలు, సాధారణంగా వండుకునే తెలంగాణ వంటకాలు ప్రపంచంలోని మరే జాతి, రాష్ట్ర, ప్రాంత వంటలకు తీసిపోవు. అంతేకాదు వీటిలో ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక యునెస్కో హైదరాబాద్‌‌‌‌ నగరాన్ని ‘‘Creative City of Gastronomy’’ గా, ‘‘ఆహార రుచులలో సృజనాత్మక నగరం’’గా 2019 సంవత్సరంలో ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 

భారతదేశం మొత్తం మీద ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపును పొందిన తొలి నగరంగా హైదరాబాద్‌‌‌‌ తెలంగాణ వంటకాలు,- రుచులు, -ఆహారపు అలవాట్లకు ప్రపంచఖ్యాతిని తేవడం విశేషం. దీనికి కాకతీయ కాలం నుండి వచ్చిన సంప్రదాయ వంటకాలు, తెలంగాణ పల్లెల్లోని గ్రామీణ వంటకాలు, ఇండో-ఇస్లామిక్‌‌‌‌, పర్షియన్‌‌‌‌, మొఘలాయి వంటల ప్రభావాలు కారణమని చెప్పొచ్చు. ఇలా తెలంగాణా రాష్ట్రం నైసర్గికంగా, భాషా సాంస్కృతికంగా మాత్రమే కాక వంటకాలు, ఆహారపు అలవాట్లపరంగా కూడా అచ్చమైన విశ్వనగరంగా రూపొందడం గర్వకారణం! 

అన్ని స్టయిల్స్‌‌‌‌

ఇండియా మీద కొన్ని వందల ఏండ్లు విదేశీయులు దాడి చేశారు. వాళ్లు మన దేశాన్ని పాలించేందుకు సులువుగా ఉంటుందని వాళ్ల సొంత గడ్డ నుంచి కొంతమందిని తీసుకొచ్చి మన దేశంలో మకాం వేశారు. అప్పుడు వాళ్లతోపాటు వాళ్ల వంటలు కూడా ఇండియాకు చేరాయి. పైగా కొన్ని విదేశీ వంట పద్ధతులు మన వంటకాలకు అప్లై అయ్యాయి. దానివల్ల విదేశీ వంటకాల ఎఫెక్ట్‌‌‌‌ మన వంటకాల మీద కొంత పడింది. ముఖ్యంగా మొఘల్​​, బ్రిటిష్, పోర్చుగీస్ ఆక్రమణదారులు భారతీయ వంటకాలకు మరింత వైవిధ్యాన్ని తెచ్చారని చెప్పొచ్చు. 

ఈ ఐదు ఇండియన్​ సిటీలు ప్రపంచంలో బెస్ట్​ 

ఫుడ్​ అనేది ఆకలి అయినప్పుడు కడుపు నింపడమే కాదు... ఆ ప్రాంతాల గుండె చప్పుడు అని చెప్పొచ్చు. ఫుడ్​ ద్వారా సంస్కృతి, చరిత్రలను తెలుసుకోవచ్చు. అలాగే ఆ వంటలు వండిన వాళ్ల ప్రేమను రుచి చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లోకల్ ఫుడ్​ ప్రాముఖ్యతను చెప్తూ టేస్ట్​ అట్లాస్​ – ‘బెస్ట్​ ఫుడ్​ సిటీస్​ ఇన్​ ద వరల్డ్’​ అని ఒక జాబితా విడుదల చేసింది. అందులో ఐదు ఇండియన్​ సిటీలు చేరాయి. ఆ జాబితాలో టాప్​ 100లో ముంబయి, హైదరాబాద్​, ఢిల్లీ, చెన్నయ్​, లక్నోలు ఉన్నాయి. కాగా టాప్​ 50లో ముంబయి 35 వ స్థానంలో, హైదరాబాద్​ 39వ స్థానంలో నిలిచాయి. ఆ తరువాత ఢిల్లీ 56వ స్థానంలో, చెన్నయ్​, లక్నోలు 65, 92 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి సిటీలు పలు రకాల చాట్స్​​ వెరైటీలతో పాపులర్​ అయ్యాయి. హైదరాబాద్​ బిర్యానీ, చెన్నయ్​ దోసె, ఇడ్లీలకు, లక్నో మొఘల్​ వంటకాలు కెబాబ్స్​, బిర్యానీలకు కేరాఫ్​గా ఉన్నాయి​. ఢిల్లీ, ముంబయిలో పాపులర్​ చాట్స్​ ఆలు టిక్కీ, గోల్​ గప్పా, పాప్డి చాట్​, దహీ భల్లా, సేవ్​ పురి, భేల్​ పురి, రగ్గా పాటీస్​, వడా పావ్​, పావ్​ భాజీ.

విదేశాల విందు...

రోమ్​ టాప్​ పొజిషన్​లో ఉంది. బోలోగ్నా, నేపుల్స్​ రెండు ఇటాలియన్​ సిటీలు వరసగా రెండు, మూడు స్థానాల్లో పలకరించాయి. మొత్తంగా మూడు ఇటాలియన్​ సిటీలు పాస్తా, పిట్జా, చీజ్​ బేస్డ్​ డిషెస్​కు చిరునామా​. టాప్​ 10లో ఉన్న మిగతా దేశాలు – వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్​), ఒసాకా(జపాన్​), హాంగ్​ కాంగ్​ (చైనా), టురిన్​ (ఇటలీ), గజియాన్​టెప్​ (టర్కీ), బన్​డంగ్​ (ఇండోనేసియా), పోజన్​ (పోలాండ్​), శాన్​ ఫ్రాన్సిస్కో (యునైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా), జెనీవా (స్విట్జర్లాండ్​), మకాటి (ఫిలిప్పీన్స్​)లు. ఈ సిటీలన్నీ అక్కడి ప్రాంతీయ వంటకాలైన రామెన్​, లకోయాకి, పైనాపిల్​ బన్, పోలెంటా, బక్లవా, స్టీమ్డ్​ ఫిష్​ కేక్స్​,  రోస్టి, హాలో హాలో వంటి వాటికి ఫేమస్​ అన్నమాట.

ఇండియా నుంచి తెలంగాణ వరకు...

మన రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆహార సంస్కృతి ఉంది. దక్కన్ పీఠభూమిపై ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరి, చిరుధాన్యాలతో తయారయ్యే వంటకాలు ఉంటాయి. వరి అన్నం ప్రధాన ఆహారం. జొన్న, సజ్జ, మక్క రొట్టెలు, సర్వపిండి రెగ్యులర్​ వంటకాలు. ఇక మాంసాహారానికి వస్తే నాటు కోడి పులుసు. గోలిచ్చిన మాంసం అంటే మసాలా మటన్ ఫ్రై, బోటి కూర, కాళ్ళ కూర (పాయ) పేర్లు వింటే చాలు నాన్​వెజ్​ లవర్స్​ ప్రాణం లేచి వస్తుంది.

ఒక్కసారి తింటే...

శాఖాహారంలో కూడా బోలెడు వెరైటీలు ఉంటాయి. చింతపండుతో చేసిన పచ్చి పులుసు తెలంగాణ ప్రత్యేకం. చింతపండు, ఎర్ర మిరపకాయలతో చేసే కొరివికారం పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరతాయి చాలామందికి. ఇక పుంటికూర (గోంగూర)ను కూరలు, పచ్చళ్ళలో బాగా వాడతారు. పుంటికూర, శెనగ పప్పు కూర రుచి తెలియాలంటే తినాల్సిందే. బియ్యప్పిండి, శెనగపప్పు, అల్లం, వెల్లుల్లి, నువ్వుల గింజలు, కరివేపాకు, పచ్చి మిర్చితో తయారు చేసే సర్వప్ప బ్రేక్​ఫాస్ట్​గా తింటారు. ఇవేకాకుండా బగారా అన్నం, కట్టుచారు, హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, సాబుదానా ఉప్మా, అంటు పులుసు, మక్క, బొబ్బర్ల గుడాలు, సల్ల చారు, మక్క గారెలు, ఉల్లిపాయ చట్నీతో తినాల్సిన సజ్జ కుడుములు, సకినాలు - బియ్యప్పిండి చిరుతిండి, గరిజె - పప్పుతో చక్కెర లేదా బెల్లం కలిపి చేసే తియ్యటి వంటకం... ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. తెలంగాణ ఆత్మను, ప్రాంతీయతను నింపుకుని అతిథులకు వెల్​కం చెప్తాయి ఇవి.
ఇండియా మొత్తంగా లోకల్​​ ఫుడ్​ విషయానికి వస్తే... పావ్​భాజీ, దోసె, వడాపావ్​, చోళే భటూరా, కెబాబ్స్​, నిహారి, పానీ పూరి, చోళే కుల్చే, బిర్యానీ, పలురకాల చాట్స్​ ఉంటాయి. ఈ రుచులు​ పొట్ట నింపడమే కాకుండా మంచి ఫీల్​ని మనసులో నింపుతాయి.

ప్రాంతానికో వెరైటీ!

భారతదేశంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత, వంట పద్ధతులు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి వంట విధానం మారుతుంటుంది. అయితే.. దాదాపు అన్ని వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా తయారుచేసుకునేలా ఉంటాయి. అందుకే విదేశీయులు మన వంటలను ఇష్టపడతారు. దీనికి కారణం.. వాటికి మన దగ్గర దొరికే మసాలాలు తోడవ్వడమే. ముఖ్యంగా మన దగ్గర దాల్చినచెక్క, లవంగాలు, మిర్చి, మిరియాలు, గరం మసాలా, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొబ్బరి పాలు, అల్లం, ఆవాలు, పసుపు లాంటివి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వంటల్లో వాడతారు. అంతేకాదు.. ప్రపంచంలోని సుగంధ ద్రవ్యాలలో 70 శాతానికి పైగా మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే మన దేశాన్ని ‘‘సుగంధ ద్రవ్యాల భూమి” అంటారు.

ప్రపంచ స్థాయిలో... 

చూడగానే కళ్లను ఆకట్టుకునేలా కనిపించే భారతీయ వంటకాలు మంచి రుచితో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌‌‌‌ దృష్టిని ఆకర్షించాయి. అందుకే ఇండియన్ ఫుడ్‌‌‌‌ వండే పద్ధతులు, పదార్థాలు ఇతర దేశాల్లో వంట పద్ధతుల మీద కూడా ప్రభావం చూపించాయి. యూకే జాతీయ వంటకంగా చికెన్ టిక్కా మసాలాను గుర్తించింది. వాస్తవానికి అది మన దేశంలో పుట్టిన వంటకమే. దీన్ని బట్టి ప్రపంచంలో భారతీయ వంటకాల ప్రాముఖ్యత ఎంతగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు వాడే పద్ధతులు, మాంసం వండే విధానం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటాలియన్, మెక్సికన్, దక్షిణాఫ్రికా, అమెరికన్​ వంటకాల్లో మన పద్ధతులు కనిపిస్తాయి. 
యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా లాంటి దేశాల్లో ఇండియన్ వంటకాలకు ఫుల్‌‌‌‌ డిమాండ్ ఉంది. కారణం..ఈ దేశాలతో పాటు చాలా దేశాల్లో మనవాళ్లు ఎక్కువగా ఉండడమే. అందుకే చాలా దేశాల్లోని చెఫ్‌‌‌‌లు ఇండియన్ ఫుడ్‌‌‌‌ వండడంలో ట్రైనింగ్‌‌‌‌ తీసుకునేందుకు ఇండియా వస్తుంటారు. 

మన దేశంలో విదేశీ వంటకాలు 

విదేశాల్లో ఇండియన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ ఎంత ఫేమస్‌‌‌‌ అయ్యిందో.. కొన్ని విదేశీ వంటకాలు ఇండియాలో కూడా అంతే ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా ఇటాలియన్ పిట్జా, చైనీస్ నూడుల్స్‌‌‌‌ దేశవ్యాప్తంగా ప్రతి నగరానికి... అంతెందుకు ఓ మాదిరి టౌన్ల వరకు చేరిపోయాయి. ఇండియన్​ బిర్యానీ రుచి ఎలాగైతే ప్రపంచమంతా విస్తరించిందో... అలానే విదేశీ రుచులు కూడా వ్యాపించాయి. ముఖ్యంగా ఇప్పుడు పిట్జా దొరకని దేశం ఉందంటే అతిశయోక్తి. అయితే.. ఈ పిట్జా, నూడుల్స్​ రెండూ ఇండియాలో పాపులర్​ అయినప్పటికీ... వాటికి ఇండియన్‌‌‌‌ స్టయిల్‌‌‌‌లో కొన్ని మార్పులు జరిగాయి. మన దగ్గర దొరికే కొన్ని మసాలాలు, కూరగాయలు కలిపి వీటికి ఇండియన్​ టచ్​ ఇచ్చేశారు మనవాళ్లు. 

-డా. మామిడి హరికృష్ణ