కాంగ్రెస్​లో కోవర్టు రాజకీయాలు .. బెల్లంపల్లిలో వినోద్​కు దూరంగా పీఎస్ఆర్​ గ్రూప్ 

కాంగ్రెస్​లో కోవర్టు రాజకీయాలు .. బెల్లంపల్లిలో వినోద్​కు దూరంగా పీఎస్ఆర్​ గ్రూప్ 
  • చేయి’ జారిన చెన్నూరు..  సీనియర్​ లీడర్​పై ఆరోపణలు ​ 
  • సీపీఐకి చెన్నూరు సీటు కేటాయిస్తే ఎవరిదారి వారు చూసుకుంటామని టికెట్  రేసులో ఉన్న లీడర్ల హెచ్చరిక

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​లో కోవర్టు​రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్  సీనియర్​ లీడర్​ మిగిలిన రెండు సెగ్మెంట్ల నుంచి తన అనుచరులను బరిలోకి దించాలని అన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన లక్ష్యం నెరవేరకపోవడంతో తన వాళ్లకు దక్కనివి వేరే ఎవరికీ దక్కరాదన్నట్టు వ్యవహరిస్తున్నారని  మిగిలిన నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్  హైకమాండ్​​ ఫస్ట్​ లిస్టులో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్​ పేర్లను ఖరారు చేసింది. లెఫ్ట్​ పార్టీలతో పొత్తులో భాగంగా చెన్నూరుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్​లో పెట్టింది. వాస్తవానికి సీపీఐ బెల్లంపల్లిని అడిగితే చెన్నూరు​కేటాయించేలా ఆ సీనియర్​ లీడరే చక్రం తిప్పారని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు.  

బెల్లంపల్లిలో పీఎస్ఆర్​ గ్రూపు సపరేటు

కాంగ్రెస్​ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి గడ్డం వినోద్​ను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు (పీఎస్ఆర్) అనుచరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మొదటి నుంచి వినోద్​ను వ్యతిరేకిస్తున్న పీఎస్ఆర్..​ బెల్లంపల్లిలో తన అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. వారిలో ఒకరికి టికెట్​ ఇప్పించి బరిలోకి దించాలనుకున్నారు. బెల్లంపల్లి టికెట్​ కోసం పోటీపడ్డ పీఎస్ఆర్​ అనుచరులు ప్రస్తుతం వినోద్​కు దూరంగా ఉంటున్నారు.

వారిలో ఇటీవలే పార్టీలో చేరిన న్యాతరి స్వామి, టీపీసీసీ లీగల్​ సెల్​ వైస్​ చైర్మన్​ కాంపెల్లి ఉదయ్​కాంత్, టీపీసీసీ మెంబర్​ చిలుముల శంకర్, మహిళా విభాగం రాష్ర్ట కార్యదర్శులు రొడ్డ శారద, చొప్పదండి దుర్గాభవాని, డీసీసీ జనరల్​ సెక్రటరీ గెల్లి జయరాం యాదవ్, యూత్​ కాంగ్రెస్​ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్, బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఎండీ అఫ్జల్, ఓబీసీ సెల్  స్టేట్​ వైస్​ చైర్మన్​ బండి ప్రభాకర్​ఉన్నారు. వారిలో చిలుముల శంకర్​ గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని  వినోద్​ మద్దతుదారులు  హెచ్చరిస్తున్నారు. 

చెన్నూరు ‘చేయి’ జారినట్టేనా? 

చెన్నూరులో సిట్టింగ్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ తీరుతో విసిగిపోయిన ప్రజలు.. కాంగ్రెస్​, బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ ఈ అవకాశాన్ని కాంగ్రెస్​ చేజార్చుకున్నట్టే కనిపిస్తోంది. చెన్నూరు​ టికెట్  కోసం కాంగ్రెస్​ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డాక్టర్​ రాజారమేశ్, పీఎస్ఆర్​ అనుచరుడు నూకల రమేశ్  తదితరులు పోటీపడ్డారు. కానీ జిల్లాకు చెందిన ఓ సీనియర్​ లీడర్​ ఈ సీటును సీపీఐకి కేటాయించేలా చక్రం తిప్పారని పలువురు ఆరోపిస్తున్నారు. తాము బెల్లంపల్లి అడిగితే చెన్నూరు​సీటు కేటాయించడంపై సీపీఐ లీడర్లే అవాక్కయ్యారు.

కాంగ్రెస్  సీనియర్​ లీడర్​కు, బాల్క సుమన్​కు ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే చెన్నూరును సీపీఐకి కేటాయించేలా వేసిన ప్లాన్​ వర్కవుట్​ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్​ సెకండ్​ లిస్టులోనూ చెన్నూరుపై క్లారిటీ రాకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు టెన్షన్  పడుతున్నారు. ఆ సీటును సీపీఐకి కేటాయిస్తే ఎవరిదారి వారు చూసుకుంటామని టికెట్ ​రేసులో ఉన్న లీడర్లు పేర్కొంటున్నారు.