2020లో ఇండియా గ్రోత్ రేటు 5 శాతమే

2020లో ఇండియా గ్రోత్ రేటు 5 శాతమే
  • కొవిడ్ 19 ప్రభావంపై వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
  • 2021లో గ్రోత్ రేట్ 2.8 శాతానికి పడిపోతుందని అంచనా

వాషింగ్టన్: కొవిడ్ 19 ఇండియన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతోందని వరల్డ్ బ్యాంక్ ఆదివారం ప్రకటించింది. 2020 లో ఇండియా వృద్ధిరేటు 2020లో 5 శాతానికి, 2021లో 2.8 శాతానికి పడిపోతుందని సౌత్ ఏషియా ఎకనామిక్ అప్ డేట్ రిపోర్టులో వెల్లడించింది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఒడిదొడుకులతో ఇదివరకే మందగమనలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కొవిడ్ 19 మరింత దెబ్బతీస్తుందని అంచనా వేసింది. దేశీయంగా సరఫరా, డిమాండ్ లో అంతరాయాల వల్ల వృద్ధిరేటు మందగిస్తుందని రిపోర్ట్ లో పేర్కొంది. సర్వీస్ సెక్టార్ పైనా తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పింది. లాక్ డౌన్ ను పొడిగిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడుతుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా చీఫ్ ఎకనామిస్ట్ హాన్స్ టిమ్మర్ అన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం. ప్రతి ఒక్కరికీ ఫుడ్ అందించడమే ప్రస్తుతం ఇండియా ముందున్న పెద్ద సవాలు అని ఆయన చెప్పారు. లోకల్ లెవెల్ లో టెంపరరీ జాబ్ లు కల్పించడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు దివాళా తీయకుండా కాపాడటం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘కొవిడ్ 19పై పోరాటంలో భాగంగా ఇండియాతో కలిసి వరల్డ్ బ్యాంక్ పనిచేస్తోందని, ఇప్పటికే రూ.7,617 కోట్లు సాయం చేసేందుకు ఆమోదించినట్లు వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ హార్ట్ విగ్ అన్నారు. డయాగ్నస్టిక్ ఎక్విప్ మెంట్ కొనుగోలు, టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు ఇతర పనుల కోసం తొలి విడత నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఎంప్లాయ్ మెంట్, బ్యాంకింగ్ అండ్ మైక్రో, చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఇండియాతో కలిసి పని చేస్తామన్నారు.

కొవిడ్ 19తో సౌత్ ఏషియాకు గట్టిదెబ్బ

కొవిడ్ 19 సౌత్ ఏషియాను గట్టిగా దెబ్బ తీసిందని, పేదరిక నిర్మూలనకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు తుడిచిపెట్టుకుపోతాయని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలను కాపాడుకోవడం, ఆర్థికంగా మళ్లీ పుంజుకోవడానికి సౌత్ ఏషియన్ గవర్నమెంట్స్ చర్యలను వేగవంతం చేయాలని సూచించింది. సౌత్ ఏషియాలోని 8 దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయని, ట్రేడ్ కుప్పకూలి ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆదివారం విడుదల చేసిన సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆరు నెలల కిందట సౌత్ ఏషియాలో 6.3 శాతం ఉన్న గ్రోత్ రేట్… 2020లో 1.8 నుంచి 2.8 శాతం మధ్యలోకి పడిపోతుందని అంచనా వేసింది. 2021లో గ్రోత్ రేట్ 3.1 శాతం నుంచి 4 శాతం మధ్యలో ఉంటుందని చెప్పింది. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు మాల్దీవులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని వెల్లడించింది

మైగ్రెంట్ వర్కర్లతో కరోనా వ్యాపించే ప్రమాదం

సొంతూళ్లకు బయలుదేరిన మైగ్రెంట్ వర్కర్లతో ఇండియా సబ్ కాంటినెంట్ లో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఇప్పటి వరకు కరోనా సోకని రాష్ట్రాలు, గ్రామాల్లోకి వైరస్ వ్యాపిస్తుందని హెచ్చరించింది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ప్రజా రవాణా వ్యవస్థను ఇప్పటికే నిలిపివేశారని, అయితే మైగ్రెంట్ వర్కర్లు కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారని చెప్పింది. అమెరికా, చైనాతో పోలిస్తే సౌత్ ఏషియాలో 65 ఏళ్లు పైబడినవారి జనాభా తక్కువగా ఉండటం అడ్వాంటేజ్ అని, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండదని రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పింది. శానిటైజర్లు, మాస్కులు, వెంటిలేటర్ లాంటి మెడికల్ ఎక్విప్ మెంట్ ల కొరత ఉంటుందని పేర్కొంది.