కరోనా శకం ముగిసింది.. ఎమర్జెన్సీ ముగిసిందన్న డబ్ల్యూహెచ్ఓ

కరోనా శకం ముగిసింది.. ఎమర్జెన్సీ ముగిసిందన్న డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన  కరోనా వైరస్ కారణంగా విధించిన  గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలిగించింది.  ఈ మేరకు కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రపంచ ఆరోగ్య సమస్యలపై మీడియా సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ కోవిడ్ అత్యవసర దశ ముగిసిందని, అయితే మహమ్మారి మాత్రం అంతం కాలేదని అన్నారు. 1, 221 రోజుల క్రితం, చైనాలోని వుహాన్‌లో తెలియని కారణంతో కొన్ని కొత్త రకం కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ తెలిపారు.  జనవరి 30, 2020న అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమావేశమైన ఎమర్జెన్సీ కమిటీ సలహా మేరకు కరోనా వ్యాప్తిపై ఆందోళన చెంది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించామని ఆయన తెలిపారు.  

సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా కేసులు,  మరణాలు కూడా తగ్గాయని.. దీంతో  వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గిందని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగిందంటూ తెలిపారు. కోవిడ్ 19 ఆరోగ్య సంక్షోభం కంటే మరింత తీవ్రమైందని తెలిపారు. కరోనా  ఎన్నో ఆరోగ్య, ఆర్థిక సమస్యలను తీసుకొచ్చిందని, కొన్ని కోట్ల మంది ఒంటరితనంతో ఆందోళన, నిరాశకు గురయ్యారని చెప్పారు. చాలా మందిని కోవిడ్ 19 పేదరికంలోకి నెట్టివేసిందని తెలిపారు.