కరోనా కు చెక్ : మార్కెట్ లో విడుదలైన మరో యాంటీ వైరల్ డ్రగ్

కరోనా కు చెక్ : మార్కెట్ లో విడుదలైన మరో యాంటీ వైరల్ డ్రగ్

భారత్ లో కరోనా వైరస్ చెక్ పెట్టేందుకు ఆయా ఫార్మా దిగ్గజాలు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే  ముంబై కి చెందిన ఫార్మా కంపెనీ  గ్లెన్ మార్క్ ఫాబి ఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరస్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్‌లను  మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫార్మా సంస్థ హెటిరో `కోవిఫర్‌` అనే పేరుతో యాంటీ వైరల్ మెడిసిన్ రెమిడిసివిర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు హెటిరో గ్రూప్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బి.పార్థ‌సార‌థి రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తితో రెమిడిసివిర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

డీసీజీఐచే అనుమ‌తి పొందిన‌ “రెమిడిసివిర్‌”  డ్రగ్ ను కరోనా  పాజిటివ్  కేసులుగా  గుర్తించిన చిన్నారులతో పాటు  కరోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాలై ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి ట్రీట్ మెంట్   కోసం వినియోగించుకోవచ్చన్నారు.  కోవిఫ‌ర్ (రెమిడిసివిర్ ) 100 మిల్లీగ్రాముల వ‌య‌ల్ (ఇంజెక్ష‌న్‌) రూపంలో అందుబాటులో ఉందని వెల్లడించారు.  వైద్య సేవ‌లు అందిస్తున్న వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించ‌వ‌చ్చు.

కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు ట్రీట్ మెంట్ అందించేందుకు గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీ తో కుదుర్చుకున్న‌ లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హెటిరో చైర్మన్ డాక్టర్ బి. పార్థసారథి అన్నారు.