62.42కి చేరిన దేశంలో కరోనా రికవరీ రేటు

62.42కి చేరిన దేశంలో కరోనా రికవరీ రేటు

దేశంలో గడిచిన 24గంటల్లో 19,138మందికి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు దేశం మొత్తంలో కరోనా వైరస్ సోకి తగ్గుముఖం పట్టిన వారి సంఖ్య 4,95,515కి చేరడంతో .. కరోనా రికవరీ రేటు 62.42శాతం ఉన్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు దేశం మొత్తం  2,76,882 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

కేంద్రం ముందస్తు జాగ్రత్తల వల్లే   

కరోనా వైరస్ పై కేంద్రం చేపట్టిన ముందస్తు చర్యలవల్లే రికవరీ రేటు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. బాధితుల్ని ముందస్తుగానే గుర్తించి వారికి టెస్ట్ లు చేయడం, గతంలో అనారోగ్య సమస్యల్ని గుర్తించడం, ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించి టెస్ట్ లు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్లు చెప్పింది.

కేంద్రం ఆదేశాలతో  రాష్ట్రాలు మరియు రాజధానులు సమన్వయంతో కలిసి పనిచేయడం వల్ల కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య పెరిగినట్లు చెప్పిన కేంద్ర ఆరోగ్యశాఖ.. జాతీయ స్థాయిలో పోలిస్తే  కరోనా  రికవరీ రేటుతో 18 రాష్ట్రాలు వాటి రాజధానుల్లో ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది.

వీటిలో – పశ్చిమ బెంగాల్ (64.94%), ఉత్తర ప్రదేశ్ (65.28%), ఒడిశా (66.13%), మిజోరం (67.51%), పంజాబ్ (69.26%), బీహార్ (70.40%), గుజరాత్ (70.72%), హిమాచల్ ప్రదేశ్ ( 74.21%), మధ్యప్రదేశ్ (74.85%), హర్యానా (74.91%), త్రిపుర (75.34%), రాజస్థాన్ (75.65%), ఢిల్లీ (76.81%), చండీగఢ్ (77.06%), చత్తీస్ గఢ్  (78.99%), ఉత్తరాఖండ్ (80.88) %) రాష్ట్రాలు ఉన్నాయి.

2.72 శాతం తగ్గిన మరణాల రేటు 

జాతీయ స్థాయిలో కేసుల మరణాల రేటు 2.72 శాతానికి తగ్గిందని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ప్రపంచంలోని  ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాల రేటు  తక్కువని వెల్లడించింది.

కాగా టెస్ట్ ట్రాక్ అండ్ ట్రీట్ స్ట్రాటజీలో భాగంగా  ఇప్పటి వరకు  1,10,24,491 మందికి కరోనా టెస్ట్ లు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది   గత 24 గంటల్లో 2,83,659 మందికి టెస్ట్ లు చేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ టెస్ట్ లు చేసేందుకు దేశం మొత్తం మీద 1169 ల్యాబ్ లు ఉన్నాయని వాటిలో  ప్రభుత్వానికి చెందినవి  835 ల్యాబ్‌లు, 334 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.