ప్రపంచాన్ని ఏకం చేయడానికే టెక్నాలజీ

ప్రపంచాన్ని ఏకం చేయడానికే టెక్నాలజీ

న్యూఢిల్లీ: టెక్నాలజీ ఉన్నది ప్రపంచాన్ని ఏకం చేయడానికే కానీ విభజించడానికి కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ యాక్సెస్ విషయంలో మరింత అప్రమత్తతతో, నిజాయితీగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘గతేడాది కరోనా మహమ్మారి కారణంగా టెక్నాలజీకి జనాలు మరింత దగ్గరయ్యారు. మునుపెన్నడూ లేనంతగా డిజిటల్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ జరిగింది. మనం ఎలా పని చేయొచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, ఎలా బతకొచ్చు అనే విషయాల్లో సాంకేతికత చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే దీంతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. సమాజంలో సాంకేతికత పాత్ర విషయంలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. అందర్నీ కలిపేలా టెక్నాలజీని వాడుకోవాలి గానీ విభజించే సాంకేతికత మనకొద్దు. కరోనా టైమ్‌లో డిజిటల్ యాక్సెస్‌‌ ఉన్న వారికి చాలా ప్రయోజనాలు చేకూరాయి. కానీ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు లేని వారు పని, విద్య, ఆరోగ్య సేవలను పొందలేకపోయారు. ఇప్పుడు సాంకేతిక విభజన కొత్త రకం అసమానతలకు దారి తీస్తోంది’ అని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.