కరోనా పేషెంట్ డెడ్ బాడీని రోడ్డుపై పడేశారు

కరోనా పేషెంట్ డెడ్ బాడీని రోడ్డుపై పడేశారు

భోపాల్‌‌‌‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్​లో ఘోరం జరిగింది. ఒక ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి షిఫ్ట్ అవుతూ కరోనాతో చనిపోయిన పేషెంట్ డెడ్ బాడీని ఆస్పత్రి బయట పడేసి వెళ్లిపోయారు అంబులెన్స్ సిబ్బంది. కనీసం బాధిత ఫ్యామిలీకి సమాచారం కూడా ఇవ్వలేదు. ‘మా తప్పేం లేదు’ అంటూ ఆ రెండు ఆస్పత్రులు చేతులు దులుపుకున్నాయి.

పడేసి వెళ్లిపోయారు..

స్థానిక పవర్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి (57) కిడ్నీ సమస్యతో రెండు వారాల కిందట భోపాల్​లోని పీపుల్స్ ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు సోమవారం సాయంత్రం తేలింది. వెంటనే కరోనా సెంటర్‌‌‌‌ ‘చిరాయు మెడికల్ కాలేజీ’కి అతడిని తరలించాలని నిర్ణయించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, ఆస్పత్రుల పట్టింపులేనితనం వల్ల అంబులెన్స్​లోనే పేషెంట్ ప్రాణాలు విడిచాడు. పీపుల్స్ ఆస్పత్రి దగ్గర సిబ్బంది బాడీని స్ర్టెచర్ నుంచి కిందికి దించి రోడ్డుపై పడేయడం, తర్వాత అంబులెన్స్ వేసుకుని వెళ్లిపోవడం సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. సోమవారం రాత్రి జరిగిందీ ఘటన.

స్ట్రెచర్ అవసరమని బాడీని పడేసి పోయారు: పీపుల్స్ ఆసుపత్రి

‘‘ప్రోటోకాల్‌‌‌‌ ప్రకారం మేం పేషెంట్​ను చిరాయు కొవిడ్‌‌‌‌-19 సెంటర్‌‌‌‌కు పంపించాం. అక్కడి నుంచి మా సిబ్బంది వచ్చేటప్పటికే మేం ఐసీయూని మూసివేశాం. డెడ్ బాడీతోపాటు వెయిట్ చేస్తున్న అంబులెన్స్ సిబ్బంది.. తమకు స్ట్రెచర్ అవసరం ఉందంటూ తొందర పెట్టారు. తర్వాత ఆస్పత్రి బయటే బాడీని పడేసి వెళ్లిపోయారు. విషయం తెలిసి నేను వెంటనే మా సిబ్బందిని పంపాను. అతడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని అనుకున్నా. కాపాడాలని భావించాను. కానీ అప్పటికే చనిపోయాడని తెలిసింది’’ అని పీపుల్స్ ఆసుపత్రి మేనేజర్ ఉదయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ దీక్షిత్‌‌‌‌ తెలిపారు.

ఎందుకు ఇంత రచ్చ: చిరాయు ఆస్పత్రి

‘‘పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్లు ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని అడిగారు. ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ పంపాం. పేషెంట్​ను ఎక్కించుకుని విఐపీ రోడ్డు దగ్గరికి వచ్చాక.. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా మారుతోందని డ్రైవర్ భావించాడు. ట్రాఫిక్ వల్ల చిరాయు ఆస్పత్రి వరకు రావడానికి 45 నిమిషాలు పైనే పడుతుందని అనుకున్నాడు. పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి వెనక్కి మళ్లాడు. 20–25 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే పేషెంట్ చనిపోయాడు. కానీ అంబులెన్స్ వెనక్కి రావడంపై పీపుల్స్ హాస్పిటల్ అధికారులు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు” అని చిరాయు హాస్పిటల్ డైరెక్టర్ అజయ్ గోయెంకా చెప్పారు.

ఇంకో ఆస్పత్రికి ఎట్ల రెఫర్ చేస్తరు?: కలెక్టర్

ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పీపుల్స్ హాస్పిటల్​ను భోపాల్ కలెక్టర్ అవినాశ్ లావానియా ఆదేశించారు. ‘‘అతడు జూన్ 23వ తేదీ నుండి అక్కడ ట్రీట్​మెంట్ పొందుతున్నాడు. పేషెంట్ కరోనా బారిన పడకుండా చూసుకోవడానికి మీరు ఏ ప్రోటోకాల్‌‌‌‌ను అనుసరించారు? ఇన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి హఠాత్తుగా కరోనా ఎలా సోకింది?” అని ప్రశ్నించారు.