10 లక్షలకు చేరువలో రికవరీలు.. తగ్గుతున్న కరోనా మరణాలు

10 లక్షలకు చేరువలో రికవరీలు.. తగ్గుతున్న కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అందరిలో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటం, మహమ్మారి వల్ల చనిపోయే వారి సంఖ్య తగ్గడం శుభసూచకంగా చెప్పొచ్చు. బుధవారం ఇండియాలో కేస్ ఫెటిలిటీ రేట్ (సీఎఫ్‌ఆర్) 2.23%గా నమోదైంది. ఏప్రిల్ 1 నుంచి మరణాల రేటును లెక్కిస్తే ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

‘టెస్టులు, ట్రాకింగ్ స్ట్రాటజీని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సంయుక్తంగా, కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో వైరస్‌తో మరణించే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రపంచ సీఎఫ్​ఆర్ రేటుతో పోలిస్తే మనం అత్యల్ప మరణాల రేటును నమోదులో ఉన్నాం. ఇది గణనీయంగా తగ్గుతోంది. ఇవ్వాళ సీఎస్‌ఆర్ 2.23 శాతంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి మరణాల రేటును చూసుకుంటే ఇదే అత్యల్పం. రికవరీ కేసులు కూడా 1 మిలియన్‌కు చేరుకుంటోంది. గత 24 గంటల్లో 35,286 మంది పేషెంట్స్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,88,029కు చేరుకుంది. రికవరీ రేటు 64.51%కి రీచ్ అయింది’ అని మినిస్ట్రీ పేర్కొంది.