కరోనా ఆంక్షల ఉల్లంఘన: ఇద్దరు జిమ్ ఓనర్ల అరెస్టు

కరోనా ఆంక్షల ఉల్లంఘన: ఇద్దరు జిమ్ ఓనర్ల అరెస్టు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, పార్కులు అన్నీ మూసేయాలని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు జిమ్ ఓనర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 31 వరకు జిమ్‌లు తెరవకూడదన్న ఆదేశాలను పట్టించుకోకుండా ఓపెన్ చేసినందుకు ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు. అందులో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉందని వెస్ట్ ఢిల్లీ డీసీపీ దీపక్ పురోహిత్ వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న వారిపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ -1897 సెక్షన్ 3, ఐపీసీ సెక్షన్ 188, 269ల కింద కేసులు పెడుతున్నట్లు చెప్పారు ఢిల్లీ పోలీసులు.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ వేగంగా అనేక ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 13 వేల మంది మరణించారు. భారత్‌లోనూ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరింది. అందులో 24 మంది డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైరస్ ప్రభావిత 75 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కూరగాయలు, పాలు, మెడికల్ వంటి అత్యవసర సేవలు మినహా రైళ్లు, బస్సులు, మెట్రో అన్నీ బంద్ చేయాలని నిర్ణయించింది.