దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. ముంబై, చెన్నై, పుణె, ఢిల్లీలో బయటపడుతోన్న కేసులు

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. ముంబై, చెన్నై, పుణె, ఢిల్లీలో బయటపడుతోన్న కేసులు

న్యూఢిల్లీ: భారత్‎లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ముంబై, చెన్నై, గుర్గావ్, పుణె, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్ కతా, కేరళ వంటి ప్రధాన నగరాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందటంతో భారీగా కేసులు వెలుగు చూస్తు్న్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా మంది తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని.. ఇంట్లోనే క్వారంటైన్‎లో ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

2025, జనవరి నుంచి ఏప్రిల్ వరకు మహారాష్ట్రలో మొత్తం 106 కేసులు నమోదైతే.. ఒక్క మే నెలలోనే ఇప్పటి వరకు 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులలో ఉంచినట్లు తెలిపారు. ఇన్ఫ్లుఎంజా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్‌లలో కూడా  కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురుగ్రామ్‎లో రెండు, ఫరీదాబాద్ లో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గురుగ్రామ్‌లో ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చిన 31 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ సోకిన ఇద్దరిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఫరీదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ 28 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ సోకినట్లు చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న అతడు ఆసుపత్రికి వెళ్లగా అక్కడ నిర్వహించిన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

తమిళనాడులో కూడా కొవిడ్ పంజా విసురుతోంది. తాజాగా పుదుచ్చేరిలో 12 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఇన్ఫ్లుఎంజా కేసులు కోవిడ్ పాజిటివ్‌గా తేలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రద్దీగా ఉండే ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ టిఎస్ సెల్వవినాయగం సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. 

కేరళలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో ఇప్పటివరకు182 కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొట్టాయంలో అత్యధికంగా 57 కేసులు, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30, ఇతర జిల్లాల్లో మిగిలిన కేసులు రికార్డ్ అయ్యాయి. మే నెలలో కర్నాటకలో ఇప్పటి వరకు 33 కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

గుజరాత్ లోకి కూడా కరోనా ఎంట్రీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లో ఒకే రోజులో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో ప్రస్తుతం 15 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని.. అన్నీ తేలికపాటి ఓమిక్రాన్ JN.1 వేరియంట్‌కు చెందినవని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వ్యాపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది.